ఇందాకే ‘దండోరా’ ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్రబృందం, ఈ సినిమా ఒక గంభీరమైన గ్రామీణ కథతో, బలమైన సామాజిక సందేశాన్ని చెప్పబోతున్నట్టు స్పష్టంగా చూపించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో కులం, అధికార బలం, ఆత్మగౌరవం వంటి అంశాలు రోజువారీ జీవితంలో ఎలా ప్రభావం చూపిస్తాయో చూపించనున్నారు. కమర్షియల్ అంశాలకు దూరంగా, సహజత్వం, బలమైన నటన, అర్థవంతమైన సంభాషణలే ఈ సినిమాకు ప్రధాన బలం.
ట్రైలర్ స్టార్టింగ్ లోనే ఒక బలమైన సన్నివేశంతో మొదలవుతుంది. ఒక మృతదేహాన్ని ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి మోసుకెళ్తారు. తన అమ్మమ్మ శవాన్ని ఇంత దూరం ఎందుకు తీసుకెళ్లాల్సి వస్తోందని ఒక చిన్నారి అడిగే ప్రశ్న, సమాధానంలోనే సమాజంలో ఉన్న క్యాస్ట్ ఫీలింగ్ మరణానికీ ఎలా అడ్డంకిగా మారుతున్నాయో తెలియజేస్తుంది. మొదట సాధారణంగా కనిపించే గ్రామీణ సమస్య, శ్మశానానికి సంబంధించిన వివాదంతో వివక్ష, ప్రతిఘటనగా మారుతుంది. కులం, విద్య గురించి వచ్చే సంభాషణలు – మార్పు రావాలంటే అవగాహన, చదువు తప్పనిసరి అన్న సందేశాన్ని బలంగా చెబుతాయి.
ట్రైలర్ చివరి భాగంలో కోర్ట్‌రూమ్ సన్నివేశం కనిపిస్తుంది. అక్కడ శివాజీ చెప్పే డైలాగ్ – కులాన్ని ఒక వ్యసనంతో పోల్చుతూ, అది తగ్గడానికి సమయం పడుతుందని చెప్పే తీరు – సినిమా ఆత్మను సూటిగా తెలియజేస్తుంది. శాంతంగా కానీ గట్టిగా ఈ కథలోని సంఘర్షణను ఆ సన్నివేశం సారాంశంగా చెప్పేస్తుంది.
సినిమా ప్రమోషన్లు ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. తొలి పాట ‘పిల్ల’ భావోద్వేగంగా ఆకట్టుకుని 3.2 మిలియన్ వ్యూస్ దాటింది. దాని హుక్ స్టెప్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతకుముందు విడుదలైన టీజర్ కూడా గ్రామీణ విజువల్స్‌తో పాటు “మరణమే మనిషికి ఇచ్చే చివరి గౌరవం” అనే లైన్‌తో ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
ట్రైలర్‌కు ఆన్‌లైన్‌లో మంచి స్పందన రావడంతో, ‘దండోరా’ విడుదలకు ముందు కీలక దశలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా డిసెంబర్ 23, 2025 నుంచి విదేశాల్లో ప్రీమియర్స్, ఆ తర్వాత డిసెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.