అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అమెరికా బయట తయారయ్యే అన్ని సినిమాల మీద 100% టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు. హాలీవుడ్ తన ప్రభావాన్ని కోల్పోతుందని, ఇతర దేశాలు భారీ ఇన్సెంటివ్‌లు, బెనిఫిట్స్ ఇస్తూ అమెరికన్ ఫిల్మ్ మేకర్స్‌ని ఆకర్షిస్తున్నాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఇండియన్ సినిమాకు, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న తెలుగు సినిమాలకు పెద్ద దెబ్బ కానుంది.
ట్రంప్ దీన్ని జాతీయ భద్రతా సమస్యగా పేర్కొన్నారు. అమెరికా సినిమా పరిశ్రమ వేగంగా క్షీణిస్తోంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఒకప్పుడు సినిమా ఉత్పత్తికి హార్ట్ గా నిలిచిన కాలిఫోర్నియా ఇప్పుడు ఎక్కువ దెబ్బ తిన్నదని అన్నారు.
గత కొన్ని ఏళ్లలో లాస్ ఏంజెల్స్ లో సినిమా, టీవీ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. కానీ విదేశీ దేశాలు ట్యాక్స్ క్రెడిట్స్, క్యాష్ రిబేట్స్ వంటి ఆఫర్లతో బలంగా ఎదుగుతున్నాయి. ఇక 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ ఖర్చు దాదాపు 250 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ రేసులో అమెరికా తన వాటా తిరిగి పొందాలని ట్రంప్ స్పష్టం చేశారు.