ప్రతి ఏడాది భారత్ నుంచి ఒక సినిమా ‘Best International Feature Film ‘ కేటగిరీలో ఆస్కార్ పోటీలోకి వెళ్తుంది. ఈసారి కూడా వివిధ భాషల్లో వచ్చిన 24 సినిమాలను పరిశీలించిన తర్వాత ఫైనల్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం, కోల్‌కతాలో సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎన్.చంద్ర అధికారికంగా ప్రకటించారు – ఈసారి భారత్ తరఫున నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వంలో వచ్చిన హిందీ సినిమా హోంబౌండ్ (Homebound) ఆస్కార్‌కి నామినేట్ అయిందని.
ఈ సినిమాను కరణ్ జోహార్ ఇంకా ఆదర్ పూనావాలా కలిసి నిర్మించారు. ఇషాన్ ఖట్టర్, విశాల్ జేత్వా ఇంకా జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కథా నేపథ్యం ఉత్తర భారతదేశంలోని ఒక చిన్న గ్రామం నుంచి మొదలవుతుంది. చిన్నప్పటి నుంచి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరాలని కలలు కనే ఇద్దరు స్నేహితుల ప్రయాణం ఇందులో ప్రధానాంశం. కానీ కులం, మతం వంటి సామాజిక అడ్డంకులు వీరి కలలకు ఆటంకాలు తెస్తాయి. అయినా, స్నేహం, పట్టుదలతో వారు ముందుకు సాగుతారు.
ఇప్పటికే హోంబౌండ్ అంతర్జాతీయ వేదికలపై మంచి పేరు తెచ్చుకుంది. 2025లో CANNES ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ కాగా, అక్కడే స్టాండింగ్ ఓవేషన్ అందుకుంది. ఆ తర్వాత టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. అక్కడ ఇంటర్నేషనల్ పీపుల్స్ ఛాయిస్ అవార్డ్లో రెండో రన్నరప్‌గా నిలిచింది.
అలాగే సోషల్ మీడియా లో కూడా ఈ న్యూస్ కంఫర్మ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు నిర్మాతలు…
ఈ సందర్భంగా నిర్మాత కరణ్ జోహార్ మాట్లాడుతూ – “భారత్ తరఫున హోంబౌండ్ ఆస్కార్‌కు వెళ్లడం మా కోసం గౌరవంగా ఉంది. నీరజ్ ఘయ్వాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది” అని అన్నారు.
అదే సమయంలో దర్శకుడు నీరజ్ ఘయ్వాన్ కూడా స్పందిస్తూ – “భారత్‌ని ఆస్కార్‌లో ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. ఇది మన భూమి, మన ప్రజల కథ. ప్రపంచానికి ఈ కథను చెప్పడం గర్వంగా ఉంది” అని అన్నారు.
ఇలా, హోంబౌండ్ ఇప్పుడు ఆస్కార్ 2026లో భారత్ తరఫున నిలబడబోతుంది. ఈ ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి కానీ, ఇప్పటి నుంచే ఈ సినిమా మీద ఆసక్తి రెట్టింపైంది.