తెలుగు సినిమా ప్రపంచం ఎన్నో ఏళ్లుగా ఒక పెద్ద తలనొప్పి గా మారిన Ibomma వెబ్సైట్ గురించి ఎప్పటికప్పుడు ఆందోళనలోనే ఉండేది. చివరకు, హైదరాబాదు పోలీసులు Ibomma అడ్మిన్ రవిని అరెస్ట్ చేయడంతో పరిశ్రమ మొత్తం ఒక ఊపిరి పీల్చుకుంది. కొంతకాలం అయినా సరే… ఈ పైరసీ మహమ్మారి కి బ్రేక్ పడిందనే భావన అందరిలో కలిగింది.
AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కూడా Ibomma ఓనర్ రవి ని అరెస్ట్ చేసిన పోలీసులకు కృతజ్ఞతలు చెప్పాడు…
“సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ శ్రీ వి.సి.సజ్జనార్ కి అభినందనలు డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. సినిమా విడుదలే ఒక మహా యజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శకనిర్మాతలకు సాధ్యం కావడం లేదు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్ సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, అతనితోనే వాటిని మూయించివేయడం స్వాగతించదగ్గ పరిణామం. పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు బృందం చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్‌లో భాగమైన పోలీసులకు, సిటీ కమిషనర్ శ్రీ వి.సి.సజ్జనార్ కి అభినందనలు తెలియచేస్తున్నాను. బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ లాంటివాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వాటి వల్ల ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా చితికిపోతున్నారో చైతన్యపరుస్తున్నారు. ఆయనతో ఓ సందర్భంలో సమావేశమైనప్పుడు పొంజీ స్కీమ్స్ మూలంగా ప్రజలు ఆర్థికంగా ఏ విధంగా మోసానికి గురై నష్టపోతున్నారో వివరించారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు శ్రీ సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకువచ్చింది. ఆయన నేతృత్వంలో చేపట్టే చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయి.”
అలాగే ఈ నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ చాంబర్ సభ్యుడు సి. కల్యాణ్ మీడియా ముందు మాట్లాడుతూ చేసిన కామెంట్ మాత్రం పూర్తిగా సంచలనంగా మారింది.
“నేను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీగా ఉన్న సమయంలో.. యాంటీ వీడియో పైరసీ సెల్ ఏర్పాటైంది. పైరసీని అరికట్టడం సాధ్యమేనా? అని అప్పుడు చాలామంది సందేహించారు. మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలన్న బాధ్యతతో దానిని ప్రారంభించాం. కొందరు విశ్రాంత పోలీసు అధికారులు అందులో భాగమయ్యారు. హాలీవుడ్ చిత్రాల పైరసీని అరికట్టాం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కృషిని స్కాట్లాండ్ పోలీసులు గుర్తించి, ప్రశంసించారు. కొంతకాలం ఫండ్ కూడా పంపించారు. ఆస్ట్రేలియా కేంద్రంగా సినిమాలను పైరసీ చేసిన ఓ వ్యక్తిని పట్టించాం. దేశంలో యాంటీ వీడియో పైరసీ సెల్‌ను నిర్వహిస్తోంది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఒక్కటే. ఒకానొక సమయంలో దానిని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఎదురైనా.. కొనసాగిస్తున్నాం’’, అని కల్యాణ్ చెప్పారు.
వీరి ఈ మాటలు కొంతమందికి షాకింగ్ గా అనిపించినా, ఆయన చెప్పిందే నిజం—ఏళ్ల తరబడి పైరసీ వల్ల సినిమా పరిశ్రమ పడిన నష్టాలు, నిర్మాతలు ఎదుర్కొన్న కష్టాలు, సినిమాలు విడుదల రోజే ఆన్లైన్ లీక్ అవ్వడం… ఇవన్నీ చూసి వచ్చిన నిస్సహాయం లోంచి వచ్చిన భావోద్వేగం అది.
Tollywood ని కుదిపేసిన Ibomma కథలో ఇది ఒక ముఖ్యమైన మలుపు. ఇక ఈ అరెస్ట్ తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయో… పరిశ్రమ ఏ దిశలో వెళ్తుందో… చూడాల్సిందే.