సినిమా అంటే ఒక వైపు ప్రజలను కలిపే శక్తి… కానీ కొన్నిసార్లు రాష్ట్రాల మధ్య వివాదాలకు కూడా కారణం అవుతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు ‘కాంతారా: చాప్టర్ 1’ చుట్టూ నెలకొంది. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హయ్యర్ టికెట్ రేట్స్ కి అనుమతి ఇవ్వడం, తెలుగు సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నది ఏంటంటే… తెలుగు సినిమాలు కర్ణాటకలో రిలీజ్ అయితే అక్కడ టికెట్ ధరలు పెంచే అనుమతి అసలు రాదు. అంతేకాదు, ఆ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తెలుగు సినిమాల పోస్టర్లు, బ్యానర్లు కూడా తొలగించబడతాయి. ‘RRR’ లాంటి పెద్ద సినిమాలు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. తాజాగా ‘గేమ్ చేంజర్’, ‘హరి హర వీర మల్లూ’, ‘OG’ వంటి సినిమాలు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ సమస్యలపై న్యాయం కోసం నిర్మాతలు కర్ణాటక హైకోర్టును కూడా ఆశ్రయించారు.
ఇలాంటి పరిస్థితుల్లో, కర్ణాటకలో తెలుగు సినిమాలకు అవమానం జరుగుతున్నా, ఇక్కడ మాత్రం కన్నడ సినిమాలకు హయ్యర్ టికెట్ రేట్స్ అనుమతి ఇవ్వడంపై తెలుగు ఫిల్మ్ సర్కిల్స్ అభ్యంతరం వ్యక్తం చేశాయి.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లారు. పవన్ మాట్లాడుతూ – “కర్నాటకలో పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అక్కడి చిత్రాలకు ఇక్కడ ప్రోత్సాహం ఇవ్వడం ఆపవద్దు. కళ అనేది మనసుల్ని కలపాలి… విడదీయకూడదు అనేది వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుందాము. మంచి మనసుతో, జాతీయ భావనలతో ఆలోచనలు చేయాలి. కన్నడ కంఠీరవ డా.రాజ్ కుమార్ గారి కాలం నుంచి ఇప్పటి కిచ్చా సుదీప్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రిషబ్ శెట్టి వరకూ అందరినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సోదరభావంతో ఉన్నాము.
మన సినిమాకు వ్యాపారపరంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని రెండు భాషల ఫిల్మ్ ఛాంబర్స్ కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడు ప్రభుత్వపరంగా మనమూ మాట్లాడదాము. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళతాను. కర్ణాటకలో ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కాంతారా ఛాప్టర్ 1 కి ఆటంకాలు కల్పించవద్దు.” అని చెప్పారు.
ఈ హైక్ ఎంతవరకు అనుమతిస్తారో GO రాగానే తెలుస్తుంది. అయితే రిపోర్ట్స్ ప్రకారం, మల్టీప్లెక్సుల్లో రూ.100, సింగిల్ స్క్రీన్లలో రూ.75 వరకు పెరగవచ్చని సమాచారం.
‘కాంతారా: చాప్టర్ 1’ లో రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, జయరాం, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సంగీతం బి అజనీష్ లోకనాథ్ అందిస్తున్నారు. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.