కార్తీ నటిస్తున్న తాజా చిత్రం ‘వా వాతియార్’ తెలుగు lo ‘అన్నగారు వస్తారు’ రిలీజ్ ఇప్పుడే కుదరేదేమో… ఎందుకంటే ఇంకా అడ్డంకులు వస్తూనే ఉన్నాయ్. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌పై విధించిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ఈ ప్రాజెక్ట్ రిలీజ్ పై ఉన్న అనిశ్చితి మరింత పెరిగింది. మొదట ఈ సినిమా డిసెంబర్లో విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు కుదిరేటట్టు కనిపించడం లేదు!

నళన్ కుమారస్వామి దర్శకత్వంలో, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై KE జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం, డిసెంబర్ 12న థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో మద్రాస్ హైకోర్టు సినిమా విడుదలపై మధ్యంతర స్టే విధించడంతో విడుదల వాయిదా పడింది.
ఈ వివాదం నిర్మాత KE జ్ఞానవేల్ రాజా ఇంకా వ్యాపారవేత్త కె. అర్జున్‌లాల్ సుందర్‌దాస్ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించినది. అర్జున్‌లాల్ సుందర్దాస్ను ఇప్పటికే దివాళా ప్రకటించగా, ఆయన ఆస్తులను నిర్వహిస్తున్న కోర్టు నియమిత అధికారి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పెండింగ్‌లో ఉన్న రుణం ఇంకా వడ్డీ మొత్తం చెల్లించే వరకు సినిమాను విడుదల చేయకూడదని పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు, సుమారు రూ.21.78 కోట్ల బాకీని క్లియర్ చేయాలని నిర్మాతను ఆదేశిస్తూ, ఆ మొత్తం చెల్లించే వరకు సినిమా విడుదల చేయరాదని స్పష్టం చేసింది.
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ స్టూడియో గ్రీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే జస్టిస్ సంజయ్ కుమార్ నేతృత్వంలోని బెంచ్, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి తాము సిద్ధంగా లేమని పేర్కొంటూ అప్పీల్‌ను కొట్టివేసింది. దీంతో ‘వా వాత్తియార్’పై ఉన్న స్టే కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు తన తుది నిర్ణయాన్ని డిసెంబర్ 27కి రిజర్వ్ చేసింది.
ఇంతకుముందు, ఎంజీఆర్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 24న సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజా సుప్రీంకోర్టు తీర్పుతో డిసెంబర్లో విడుదల కావడం ఇక అసాధ్యమేనని తెలుస్తోంది.