సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎప్పటిలాగే మంచి సినిమాలకు అండగా నిలుస్తూ, వాటిని మరింత మంది ప్రేక్షకుల దాకా చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పుడు ఆయన మరోసారి అలాంటి ప్రయత్నంలో ఉన్నారు. మహేశ్ బాబు చేతుల మీదుగా సోషియో-మిథలాజికల్ ఎపిక్ జటాధర థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది.
ఈ భారీ చిత్రంలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించగా, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఈ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు, భగవంతుడైన శివుడిపై విశ్వాసంతో చెడును ఎదుర్కొనే భక్తుడి పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు సోనాక్షి ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలో ధన పిశాచి గా కనిపించబోతోంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల్లో ఆసక్తి రోజు రోజుకీ పెరుగుతోంది. ఇలాంటి వేళ మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ కావడం సినిమాకు మరింత హైప్ తెస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
భారీ అంచనాలతో రూపొందుతున్న జటాధర నవంబర్ 7న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. భగవంతునిపై విశ్వాసం, మానవత్వం, చెడుపై సత్యం గెలుపు వంటి అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం విశేష ఆకర్షణగా మారనుంది.