భారతీయ సినిమాకి అత్యున్నత గౌరవంగా భావించే అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. భారత ప్రభుత్వము ఈ అవార్డును ప్రతి సంవత్సరం నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సందర్భంగా ప్రదానం చేస్తుంది. సినిమాకు విశేష సేవలందించిన వారిని గుర్తించి ఈ అవార్డు ఇస్తారు. ఈ అవార్డు వెనుక స్ఫూర్తి, భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే.
ఇలాంటి గౌరవాన్ని ఈ ఏడాది 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో మలయాళ సినీ రంగానికి ప్రాణం పోసిన లెజెండరీ నటుడు మోహన్‌లాల్ అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న వారిలో అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచిన మోహన్‌లాల్, కేరళ రాష్ట్రానికి చెందిన రెండవ వ్యక్తిగా ఈ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.
తన స్పీచ్ లో మోహన్‌లాల్ ఎంతో వినయంగా స్పందించారు. “ఈ అవార్డు నాకు మాత్రమే కాదు, మొత్తం మలయాళ సినీ పరిశ్రమకే చెందింది. మన పరిశ్రమ సృజనాత్మకతకి, కష్టానికి ఇది ఒక గుర్తింపు. ఈ అవార్డు విన్న వెంటనే గర్వంగా, అదృష్టంగా అనిపించింది. ఇది మన సినిమాల గొంతుకకి ఇచ్చిన గౌరవం,” అని అన్నారు.
తన భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తూ, “ఇది నా కల నెరవేరింది అనడం కాదు… అది మించిన అనుభూతి. ఈ గౌరవం నా కోసం మాత్రమే కాదు, దశాబ్దాలుగా మలయాళ సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ సమర్పణ. కవి కుమారన్ ఆసాన్ చెప్పినట్టుగా – ‘ఈ పువ్వు నేలపై పడిపోలేదు, అందాన్ని మిగిల్చింది’ – అలానే మన కళా వారసత్వం ఎప్పటికీ నిలిచిపోతుంది,” అని చెప్పారు.
తరువాత భారత ప్రభుత్వం, రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడీ, సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ, అలాగే జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై కూడా తాను సినిమాల్లో తన ప్రయాణాన్ని నిజాయితీతో, అంకితభావంతో కొనసాగిస్తానని మోహన్‌లాల్ హామీ ఇచ్చారు.