ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ వచ్చే సంక్రాంతికి, అంటే జనవరి 9, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని మన అందరికి తెలుసు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్గా వస్తోంది. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ అభిమానులకు నిజంగా ఒక విందు లాంటిది. ట్రైలర్ రిలీజ్ డేట్ కి మూడు నెలలు ముందు రిలీజ్ చేయడం కూడా ఒక ట్రీట్ ఏ మరి…
ట్రైలర్ లో ప్రభాస్ ఒక కేర్ ఫ్రీ వ్యక్తిగా పరిచయం అవుతాడు. కానీ అతను మానసిక సమస్యలతో చికిత్స తీసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ హాంటెడ్ హౌస్లోకి వెళ్ళి దెయ్యం ఉనికిని గమనిస్తాడు. ఆ దెయ్యాన్ని తన తాతతో పోల్చుకుంటాడు. అంతేకాదు, తన జీవితంలోకి వచ్చే ఆడవారిని కలవడం, ఆ తర్వాత జరిగే డ్రామాటిక్ సంఘటనలు అతన్ని మిస్టరీలతో నిండిన హాంటెడ్ హౌస్ లోకి నెట్టేస్తాయి.
ఈ సినిమాలో సంజయ్ దత్ ఒక దెయ్యం పాత్రలో కనిపించబోతున్నారు. ప్రభాస్ కి ఆయనతో ప్రత్యేకమైన కనెక్షన్ ఉందని ట్రైలర్ సూచిస్తుంది. ఓ సన్నివేశంలో ప్రభాస్ వయసైన లుక్లో సింహాసనం మీద కూర్చుని, సంజయ్ దత్ స్థానాన్ని భర్తీ చేసినట్లు చూపించారు. కొన్ని ముఖ్యమైన క్లూస్ ఇస్తూనే, ట్రైలర్ లో మిస్టరీని సస్పెన్స్ లో ఉంచారు.
వీఎఫ్ఎక్స్ పనితనం అద్భుతంగా ఉంది. నీటిలో మొసలితో పోరాడే సీన్, ఫాంటసీ సినిమాల్లో కనిపించే టాస్క్స్ లాంటివి ప్రభాస్ ఎదుర్కొనడం విజువల్ గా ఆకట్టుకుంటుంది. థమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా బాగుంది.
ముఖ్యంగా, ఈ మధ్య వరుసగా సీరియస్ రోల్స్ చేసిన ప్రభాస్, ఈ సినిమాలో తన కేర్ ఫ్రీ, జాయ్ ఫుల్ అవతార్ లో కనిపించడం అభిమానులకు రిలీఫ్ ఇస్తుంది. మారుతి ఒక హోల్సమ్ ఎంటర్టైనింగ్ సినిమా పండించినట్లు కనిపిస్తోంది. ప్రేక్షకులు దాన్ని ఎలా స్వీకరిస్తారో చూడాలి.
ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమా నిర్మాణం జరుగుతోంది. సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు.