పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు రేపుతున్న చిత్రం కాంతారా: చాప్టర్ 1. ఇది ఇప్పటికే సూపర్ హిట్ అయిన కాంతారాకి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోంది. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్‌కి మిక్స్‌డ్ టాక్ వచ్చినా, టెక్నికల్‌గా మాత్రం అదరగొట్టిందని అందరూ అంగీకరించారు. విజువల్స్, బీభత్సమైన వీఎఫ్ఎక్స్ అన్నీ ఆకట్టుకున్నాయి కానీ, కంటెంట్ పరంగా కాస్త బలహీనంగా ఉందనే అభిప్రాయం కూడా వినిపించింది.
ఈ నేపథ్యంలో, బెంగళూరులో సినిమా టీం ఓ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో హీరో రిషబ్ శెట్టి తన అనుభవాలను షేర్ చేశారు. అక్కడ ఆయన చెప్పిన మాటలు విన్న వాళ్లందరినీ షాక్‌కి గురి చేశాయి.
“ఈ సినిమా షూటింగ్ సమయంలో నేను 4-5 సార్లు మరణం అంచుల వరకూ వెళ్లాను. పెద్ద ప్రమాదాలు జరిగి తప్పించుకున్నా. మొదటి రోజు నుంచి అనుకోని ఘటనలు, యాక్సిడెంట్స్ జరిగాయి. కొందరు సినిమా యూనిట్‌లో ఉన్న వాళ్లు కూడా మిస్టీరియస్‌గా లేదా హఠాత్తుగా చనిపోవడం వల్ల మేమందరం షాక్ అయ్యాం. ఆ పరిస్థితుల్లో షూటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది” అని రిషబ్ చెప్పారు.

అయినా, ఆ కష్టాలన్నిటిని అధిగమించి సినిమా పూర్తిచేశామని ఆయన గర్వంగా చెప్పారు. “గత మూడు నెలలుగా మేము ఒక్కరోజు కూడా సరిగ్గా నిద్రపోలేదు. మా డైరెక్షన్ టీం నుంచి ప్రొడ్యూసర్స్ వరకూ అందరూ తమ సొంత సినిమా లాగా ఈ ప్రాజెక్ట్‌కి అంకితం అయ్యారు. ప్రతి ఒక్కరూ తమ హృదయంతో పనిచేసారు కాబట్టి ఇక్కడికి వచ్చాం. నిజంగా దేవుడు మమ్మల్ని కాపాడి ఈ సినిమా పూర్తి చేయించాడని నేను నమ్ముతున్నా” అని రిషబ్ భావోద్వేగంతో చెప్పారు.
హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమా భూతకోల ఆచారం ప్రాచీన మూలాలను అద్భుతంగా చూపించబోతోంది. రిషబ్ శెట్టి, అనిరుధ్ మహేష్, షనిల్ గురు స్క్రీన్‌ప్లే రాసారు. రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్యతో పాటు మరికొందరు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
భారీ అంచనాల నడుమ వస్తున్న కాంతారా: చాప్టర్ 1 అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ బజ్ పెంచేసింది. ఈసారి రిషబ్ ప్రాణం పెట్టి చేసిన సినిమా కాబట్టి, థియేటర్లలో ఆ మాయాజాలం ఎలా ఉంటుందో చూడాలి.