దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మహిళల డ్రెస్సింగ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీసాయి. ఈ అంశంపై మహిళా కమిషన్ కూడా శివాజీకి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా సినీ పరిశ్రమకు చెందిన పలువురు మహిళా దర్శకులు, నిర్మాతలు, నటీమణులు తమ అసోసియేషన్లకు లేఖలు రాస్తూ ఆయన వ్యాఖ్యలను ఖండించారు. సోషల్ మీడియాలో కూడా పలువురు ప్రముఖులు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఈ విషయం మరింత చర్చకు దారితీసింది.
ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో శివాజీ తాను ఉపయోగించిన మాటలకు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా అసౌకర్యం కలిగితే బాధగా ఉందని తెలిపారు. అయితే తన వివరణలో భాగంగా లులు మాల్‌లో నటీమణి నిధి అగర్వాల్‌కు ఎదురైన ఘటనను ప్రస్తావించారు. ఆ సమయంలో ఆమె దుస్తుల విషయంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే, ఆ వీడియో ఎప్పటికీ ఇంటర్నెట్‌లో ఉండిపోయేదని, అది ఆమెకు తీవ్రమైన ఇబ్బందులు కలిగించేదని ఆయన అన్నారు. ఆ ఆందోళనతోనే తాను అలా మాట్లాడానని శివాజీ తెలిపారు.
కానీ వాస్తవానికి ఆ లులు మాల్ ఘటనలో నిధి అగర్వాల్ బాధితురాలే. అభిమానుల అనూహ్య గుంపు ఒత్తిడి కారణంగా ఆమె తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆమె దుస్తుల గురించి ప్రస్తావించడం మరోసారి బాధ్యతను బాధితురాలిపైనే మోపినట్లుగా ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరోక్షంగా స్పందించారు. బాధితులపై నిందలు మోపడం తప్పు, దారితప్పించే విధంగా ఉంటుందని అర్థమయ్యేలా ఆమె స్టేటస్ పెట్టారు. ఎవరి పేరును ప్రస్తావించకపోయినా, అది శివాజీ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే విస్తృతంగా భావిస్తున్నారు.

ఇంతకుముందు లులు మాల్ ఘటనపై నిధి అగర్వాల్ కేసు పెట్టకుండా, విషయం నిశ్శబ్దంగా ముగియాలని కోరుకున్నారు. కానీ శివాజీ తాజా వివరణతో ఈ అంశం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
దండోరా సినిమా ప్రమోషన్లపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం ఈ వివాదం త్వరగా చల్లారేలా కనిపించడం లేదు.