తెలుగు సినీ ప్రపంచంలో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ ఏంటంటే – హీరోల చిన్నప్పటి పాత్రల్లో స్టార్ కిడ్స్‌ను తీసుకోవడం. ఫ్యామిలీ రీసెంబ్లెన్స్ వల్ల పాత్రకు సహజత్వం వస్తుంది కాబట్టి దర్శకులు అలానే పిల్లల్ని చూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే ట్రెండ్ లోకి మహేష్ బాబు మేనల్లుడు, సుధీర్ బాబు కొడుకు సినిమాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు…
సూపర్ స్టార్ మహేష్ బాబు మరిది, నటి ప్రియదర్శినీ భర్త సుధీర్ బాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన యాక్టింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సుధీర్ బాబుకు ఇద్దరు కుమారులు – చారిత్ మానస్, దర్షన్.

ఇద్దరిలో పెద్దవాడు చారిత్ మానస్ కి తన మామ మహేష్ బాబు పోలికలు కనిపిస్తాయని అభిమానులు తరచూ అంటుంటారు. ఆయన భలే భలే మగాడివోయ్ (2015)లో యంగ్ నానిగా నటించి ఆకట్టుకున్నాడు. త్వరలో హీరోగా తెరంగేట్రం చేయనున్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఇక చిన్నవాడు దర్షన్ అయితే ఇప్పటికే చిన్న వయసులోనే పలు పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. గూడచారి లో యంగ్ అడవి శేష్‌గా, సర్కారు వారి పాట లో యంగ్ మహేష్ బాబుగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు ఈ యంగ్ టాలెంట్ మరో పెద్ద అవకాశం దక్కించుకున్నాడు — అదే ప్రభాస్ చిన్నప్పటి పాత్ర!
అవును… సుధీర్ బాబు తాజాగా తన రాబోయే చిత్రం జటాధర ప్రమోషన్స్‌లో పాల్గొంటూ, దర్షన్ ఫౌజీ చిత్రంలో యంగ్ ప్రభాస్‌గా నటిస్తున్నాడని అధికారికంగా వెల్లడించాడు. ఈ పాత్రలో దీర్ఘమైన సంస్కృత సంభాషణలు ఉన్నాయని, దర్షన్ వాటిని నమ్మకంగా, అద్భుతంగా చెప్పాడని చిత్ర బృందం చెబుతోంది.

ఇద్దరు కుమారులూ నటన వైపు ఆసక్తి చూపుతుండటంతో సుధీర్ బాబు కుటుంబం నుంచి మరో తరం సినీ తారలు రావడం ఖాయం అని చెప్పవచ్చు.
ఫౌజీ ఒక హిస్టారికల్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా, అందులో రొమాంటిక్ టచ్ కూడా ఉంటుందట. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వీ నటిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు.