అప్పడే ఈ ఇయర్ అయిపోతోంది… డిసెంబర్ ఎండింగ్ కి వచ్చేసాం… ఇంకా క్రిస్మస్ సీజన్ తెలుగు సినిమాలకు పెద్ద హాలిడే ప్యాకేజ్ కాబట్టి, చాల సినిమాలు లైన్ లో ఉన్నాయ్. అఖండ 2 డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా, అది డిసెంబర్ 12కు వాయిదా పడడంతో, ఆ తర్వాతి వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిన్న సినిమాలన్నీ ఇబ్బందుల్లో పడ్డాయి. ఫలితంగా చాలా సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకోవాల్సి వచ్చింది.
మౌగ్లీ మాత్రం కేవలం ఒక రోజు గ్యాప్‌తో విడుదల కావడం సాధ్యమైంది. కానీ మిగతా సినిమాలన్నీ ఆ వారం నుంచి తప్పుకొని, ఇప్పుడు క్రిస్మస్ను తమ కొత్త టార్గెట్‌గా ఎంచుకున్నాయి. దీంతో ఈ పండుగ సీజన్ మొత్తం మిడ్ రేంజ్, చిన్న బడ్జెట్, డబ్బింగ్ సినిమాలతో నిండిపోనుంది. పెద్ద స్టార్ సినిమా ఏదీ లేకపోవడంతో, ప్రేక్షకులకు ఒక చిన్న సినిమా పండుగలా ఈ క్రిస్మస్ మారనుంది.

రోషన్ మేకా నటించిన చాంపియన్, ఆది సాయికుమార్ శంభాల సినిమాలు ఇప్పటికే క్రిస్మస్ ముందుగా ప్లాన్ చేసుకుని, అదే తేదీకి రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఇప్పుడు అదే రేసులోకి వచ్చాయి. మొదట డిసెంబర్ 12న విడుదల కావాల్సిన హారర్ సినిమా ‘ఈషా’ ఇప్పుడు డిసెంబర్ 25కి షిఫ్ట్ అయ్యింది. అలాగే ‘అన్నగారు వస్తారు’ కూడా క్రిస్మస్ విడుదలకే మారినట్లు సమాచారం.
శివాజీ ప్రధాన పాత్రలో నటించిన ‘దండోర’ కూడా క్రిస్మస్ రిలీజ్ లక్ష్యంగా పెట్టుకుంది. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన ‘మార్క్’ సినిమా తెలుగులోనూ అదే సమయంలో విడుదల కానుంది. మోహన్‌లాల్ నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘వృషభ’ కూడా ఈ సీజన్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడంతో, దీనికి మంచి స్థాయిలో విడుదల ఉండబోతుందని టాక్.
ఇవే కాకుండా పతంగ్, వానర వంటి చిన్న సినిమాలు కూడా హాలిడే సీజన్‌ను ఎంచుకున్నాయి. మొత్తంగా డిసెంబర్ చివరి వారంలో దాదాపు ఎనిమిది సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద బడ్జెట్ సినిమాలు లేకపోవడం, కొన్ని డబ్బింగ్ చిత్రాలే కావడంతో థియేటర్ల సమస్య పెద్దగా ఉండకపోవచ్చు.
ఇప్పుడు అసలు ఆసక్తికరమైన ప్రశ్న ఒక్కటే… ఈ సినిమాల్లో ప్రేక్షకుల మనసు గెలుచుకుని, క్రిస్మస్ విన్నర్‌గా నిలిచేది ఏ సినిమా?