భారతీయ సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు పెద్దగా కనిపించని సినిమాల్లో యానిమేషన్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా యానిమేషన్ సినిమాలకు చాల ప్రేక్షకాదరణ ఉన్నప్పటికీ, భారతదేశంలో మాత్రం ఈ జానర్‌కు థియేటర్ స్థాయిలో సరైన ఆదరణ దక్కలేదు. దీర్ఘకాలంగా తక్కువ వసూళ్ల చరిత్ర ఉండటంతో, ప్రేక్షకుల నుంచి ముందస్తు అంచనాలు ఉండవన్న భయంతో మన దర్శకులు యానిమేషన్ వైపు అడుగేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపలేదు.
కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది… ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా చైనా మార్కెట్‌లో Zootopia 2 సాధించిన సంచలన విజయంతో, భారతీయ దర్శకులకు యానిమేషన్ సినిమాలపై కొత్త ఆశలు మొదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించగలిగే శక్తి ఈ జానర్‌కు ఉందని Zootopia 2 మరోసారి నిరూపించింది.
ఇదే సమయంలో, ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన మహావతార్ నరసింహ సినిమా భారతీయ యానిమేషన్‌కు కొత్త దారులు తెరిచింది. పౌరాణిక కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం, ఒక్క భారత మార్కెట్ నుంచే సుమారు 300 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడం, యానిమేషన్‌లో ఇంకా అన్వేషించని అపారమైన అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా చూపించింది.
సుమారు 2000 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన Zootopia 2, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,000 కోట్ల రూపాయలు (1.137 బిలియన్ డాలర్లు) గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఇందులో సగానికి మించిన ఆదాయం చైనా మార్కెట్ నుంచే రావడం గమనార్హం. ఈ స్థాయి విజయం ప్రపంచవ్యాప్తంగా కొత్త తరం దర్శకులను యానిమేషన్ సినిమాల వైపు ఆకర్షించేలా చేస్తోంది.