ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ అంటే ఎంత ప్రెజర్ ఉంటుందో చెప్పక్కర్లేదు. అందులోనూ ఫైనల్ మ్యాచ్ దాయాదీ దేశం పాకిస్తాన్‌తో ఆడుతుంది అంటే ఆ ప్రెజర్ రెట్టింపు ఉంటుంది. ఏ చిన్న తప్పు చేసినా దానికి భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఆసియా కప్ 2025 మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరుకోవడం ఒకెత్తైతే, ఫైనల్‌లో మరోసారి పాకిస్తాన్‌తో తలపడి ఆ జట్టును మట్టికరిపించడం మరొక ఎత్తు.
లీగ్ దశలో పాక్‌ను చిత్తు చేసిన భారత్ సూపర్ ఫోర్‌లోనూ అదే దూకుడును ప్రదర్శించింది. అయితే, కీలక దశలో బంగ్లాపై విజయం సాధించిన పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకుంది. రెండు మ్యాచ్‌లలో ఓడిన పాక్ ఎలాగైనా ఫైనల్‌లో గెలవాలని నిర్ణయం తీసుకుంది. భారత్‌ను మానసికంగా దెబ్బతీసేందుకు, తప్పులు చేసేందుకు పదేపదే పాక్ ఆటగాళ్లు ప్రయత్నించారు. కానీ, సూర్యకుమార్ సారథ్యంలో జట్టు సమన్వయంతో ముందుకు సాగింది. లక్ష్యం తక్కువే అయినా, చేధన అంటే చాలా కష్టం. ఒత్తిడి పెరుగుతుంది. దానికి తగ్గట్టుగానే 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడం నైతికంగా ధైర్యం దెబ్బతింటుంది. కానీ, అవసరమైన సమయంలో తిలక్ వర్మ రాణించడంతో విజయం సొంతమైంది.
విజయం తరువాత పాక్ మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడం ఇష్టంలేని భారత్, ట్రోఫీని తిరస్కరించింది. ఇదంతా ఒకెత్తేతై, సూర్యకుమార్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మాటలు మరొక ఎత్తు. ఆపరేషన్ సింధూర్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఇండియన్ ఢిఫెన్స్ రంగానికి ఈ సీరిస్‌లో తనకు వచ్చిన మ్యాచ్ ఫీజును ఫండ్‌గా ఇస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ ఒక్కమాటతో సూర్యకుమార్ యాదవ్ భారతీయుల మనసును గెలుచుకున్నాడు. మనం ఈరోజు ఎవరి ఇంట్లో వాళ్లు ప్రశాంతంగా ఉంటున్నాము అంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీనే. సరిహద్దుల్లో, ఆకాశంలో, సముద్రంలోనూ మన సైన్యం అనుక్షణం రక్షణగా ఉంటూ శతృవుల నుంచి దేశాన్ని కాపాడుతున్నది. మరి మనల్ని రక్షించేవారికోసం మనం ఏం చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మన వంతు సాయంగా ఒక్కరూపాయి ఫండింగ్ చేసినా… అది దేశ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది.