అబుధాబీలోని జైద్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆసియా కప్ గ్రూప్ ఏ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఒమన్‌తో జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకు నువ్వానేనా అన్నట్టుగా సాగింది. అయితే, భారత అనుభవం ముందు ఒమన్ ఓటమిపాలవ్వక తప్పలేదు. కానీ, ఒమన్ పోరాట పటిమ అందర్నీ ఆకట్టుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టు 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ కేవలం 15 బంతుల్లో 39 పరుగులు చేయగా, సంజు శాంసన్ 45 బంతుల్లో 56 పరుగులు చేశాడు. అయితే శుభ్‌మన్ గిల్ మరోసారి నిరాశపరచడం ఆందోళన కలిగించింది. కాగా, మిగతా బ్యాట్స్‌మెన్లు కూడా కొంత సహకరించడంతో భారత జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు సాధించి, ఒమన్ ముందు 189 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
టీ 20 క్రికెట్‌లో ఏమైనా జరగవచ్చు. పొట్టి ఫార్మాట్‌లో ఎవరి చేతి బలం ఎక్కువగా ఉంటే వారిదే విజయం. దీనిని దృష్టిలో ఉంచుకొని ఒమన్ జట్టు బ్యాటింగ్‌కు దిగి మొదటి నుంచి భారత్‌కు చుక్కలు చూపింది. ఒమన్ బ్యాటింగ్ విభాగంలో అమీర్ కాలీమ్, హమ్మాద్ మీర్జాలు హాఫ్ సెంచరీలు చేశారు. తమను తక్కువగా అంచనా వేయవద్దని, భవిష్యత్తులో విజయాలు అందుకునే స్థాయికి చేరుకుంటామని చెప్పకనే చెప్పారు. విజయం కోసం చివరి వరకు పోరాటం చేసిన ఒమన్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. భారత్ వంటి బలమైన జట్టుపై ఆ స్థాయిలో పరుగులు సాధించడం అంటే మామూలు విషయం కాదు. రాబోయే రోజుల్లో ఒమన్ జట్టుతో జాగ్రత్తగా ఉండాలి.
ఒమన్‌ను కట్టడి చేసేందుకు భారత్ బౌలింగ్ విభాగం చాలా కష్టపడింది. ఆర్శ్‌దీప్ సింగ్ ఈ విషయంలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. టీ 20 ఫార్మాట్‌లో అర్శ్‌దీప్ సింగ్ వందో వికెట్‌ను ఒమన్‌పై సాధించడం విశేషం. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో పాలుపంచుకున్నాడు అర్శ్‌దీప్ సింగ్.