బైక్ రేసింగ్ అంటే చాలా మందికి కేవలం హాబీ మాత్రమే. కానీ ఐశ్వర్య పిస్సేకి అది జీవనాధారం, అది శ్వాస, అది సాహసానికి ప్రతీక. అబ్బాయిలే ఆధిపత్యం చెలాయించే రేసింగ్ ప్రపంచంలో ఈ బెంగళూరు యువతి తన ప్రతిభతో, పట్టుదలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
పోర్చుగల్‌లో జరిగిన ఎఫ్‌ఐఏఎం వరల్డ్‌వైడ్ ర్యాలీ 2 విభాగంలో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది ఐశ్వర్య. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా మహిళ, తొలి భారతీయురాలు అనే గుర్తింపుతో దేశానికి గర్వకారణమైంది. చిన్ననాటి నుంచే సాహసాలంటే ఇష్టపడే ఆమె, ఇంటర్ చదువుతున్న రోజుల నుంచే బైక్‌లపై ఆసక్తి పెంచుకున్నారు. కుటుంబం మొదట అంగీకరించకపోయినా, తాను సాధించగలననే నమ్మకంతో ముందుకుసాగారు.
బెంగళూరులోని అపెక్స్ రేసింగ్ అకాడమీలో ప్రొఫెషనల్ శిక్షణ ప్రారంభించి, తర్వాత క్యాలిఫోర్నియాలోని సూపర్ బైక్స్ అకాడమీలో రేసింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నారు. 2015లో మొదటిసారి జాతీయ స్థాయిలో రేసింగ్‌లో పాల్గొన్న ఆమె, ప్రతి పోటీలో తన నైపుణ్యాన్ని పెంచుకుంటూ వచ్చింది.
రేసింగ్ అంటే కేవలం వేగమే కాదు, ధైర్యం, శ్రద్ధ, క్రమశిక్షణ అవసరం. ప్రమాదకరమైన, ఖరీదైన ఈ క్రీడలో నిలదొక్కుకోవడం చిన్న విషయం కాదు. కానీ ఐశ్వర్య 2017లో టీవీఎస్ ఫ్యాక్టరీ రేసర్‌గా ఎంపికై తన కెరీర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది. 2017లో హిమాలయాల్లో జరిగిన కఠినమైన ర్యాలీని పూర్తి చేసి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ రేస్ తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది.
2017 నుంచి 2022 వరకు వరుసగా ఐదు సంవత్సరాలు నేషనల్ ర్యాలీ చాంపియన్‌గా నిలవడం ఆమె ప్రతిభకు నిదర్శనం. ప్రతి విజయంతో ఆమె బైక్ గర్జన దేశవ్యాప్తంగా వినిపించింది. పురుషాధిక్య క్రీడల్లో మహిళలకూ స్థానం ఉందని నిరూపించింది.
నేడు ఐశ్వర్య కేవలం రేసర్ మాత్రమే కాదు, కొత్తతరం అమ్మాయిలకు ప్రేరణ. “వేగం అంటే భయం కాదు, అది నియంత్రణలో ఉన్న ధైర్యం” అని ఆమె అంటుంది. సాహసాన్ని వృత్తిగా మార్చుకున్న ఐశ్వర్య, భారత మహిళా శక్తికి కొత్త నిర్వచనం ఇస్తూ ప్రపంచ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తోంది.