Native Async

అబ్దుల్ కలాం ఆకాంక్షించిన రీతిలో పంచాయతీలు…

Andhra Pradesh Govt Approves Major Panchayat Reforms Led by CM Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan
Spread the love

గ్రామా పంచాయితీలకు నూతన సంస్కరణలు – ఆమోదం తెలిపిన AP కాబినెట్… పల్లెలకు పంచాయితీలు ఎంత ముఖ్యమో మనకు తెలిసిందే… కానీ అవి రాజకీయ చదరంగంగా మారి, ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంటున్నాయి.

అందుకే, నిన్న AP కాబినెట్ మీటింగ్ లో CM చంద్ర బాబు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఇంకా కాబినెట్ మెంబెర్స్ అందరు కలిసి పంచాయితీ వ్యవస్థలను ఎలా బాగు పరచాలని అలోచించి, నూతన సంస్కరణలకు ఆమోదం తెలిపారు…

  • పునర్వ్యవస్థీకరణతో గ్రామ పంచాయతీలు బలోపేతం
  • స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా గ్రామ పంచాయతీలు
  • గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థ రద్దు
  • 10 వేలు జనాభా దాటిన పంచాయతీలకు రూర్బన్ పంచాయతీలుగా గుర్తింపు
  • పట్టణ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతో రూర్బన్ పంచాయతీలు
  • నాలుగు గ్రేడ్లుగా పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ
  • గ్రామ కార్యదర్శి పేరు పంచాయతీ అభివృద్ధి అధికారి (పి.డి.ఓ.)గా మార్పు
  • పంచాయతీరాజ్ లో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటు

గ్రామ పంచాయతీల పరిపాలనా వ్యవస్థలో నూతన సంస్కరణలకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గ్రామ పంచాయతీల్లో పారదర్శకతతో కూడిన పాలన అందించేందుకు ఈ నూతన విధానాలకు రూపకల్పన చేశారు. మాజీ రాష్ట్రపతి డా.అబ్దుల్ కలాం గారు ‘పల్లెల్లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి, పౌర సేవలు సక్రమంగా అందేలా పాలన వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని చెప్పారు. ఆ స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకువచ్చేలా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పంచాయతీరాజ్ పరిపాలన సంస్కరణలపై ఆయన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ శాఖల ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం చేసిన నిపుణులతో నాలుగు నెలల పాటు పలు దఫాలు చర్చలు చేశారు. 10 వేలు జనాభా దాటిన పంచాయతీలను ఇకపై రూర్బన్ పంచాయతీలుగా గుర్తిస్తారు. పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను రూర్బన్ పంచాయతీలలో కల్పిస్తారు. వీటి పరిధిలో 359 పంచాయతీలు వస్తాయి. నూతన విధానంలో గతంలో ఉన్న క్లస్టర్ విధానం రద్దు చేసి పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా వర్గీకరించనున్నారు. పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారి (పి.డి.ఓ.)గా మార్పు చేశారు.

స్వతంత్ర యూనిట్లుగా 13,351 గ్రామ పంచాయతీలు
గ్రామ పంచాయతీల్లో పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న క్లస్టర్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. 7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలను ఇక మీదట స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పరిగణిస్తారు. పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా పునర్ వర్గీకరించింది.

రూర్బన్ పంచాయతీల్లో పట్టణ తరహాలో సిబ్బంది నియామకం… సేవలు
మరో మూడు గ్రేడ్లుగా గ్రామ పంచాయతీలను వర్గీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రేడ్ 1 పంచాయతీల్లో పని చేస్తున్న 359 మంది కార్యదర్శుల వేతన శ్రేణి పెంపుతోపాటు డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (డెప్యూటీ ఎం.పి.డి.ఓ.) కేడర్ కు వారికి పదోన్నతి కల్పిస్తారు. వీరిని 359 రూర్బన్ పంచాయతీల్లో నియమిస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఐదు గ్రేడ్ల పంచాయతీ కార్యదర్శులను మూడు గ్రేడ్లుగా సమీకరిస్తారు. వీరితోపాటు 359 మంది జూనియర్ అసిస్టెంట్/జూనియర్ అసిస్టెంట్-కమ్-బిల్ కలెక్టర్ల వేతన శ్రేణి పెంపుతోపాటు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తారు. మెరుగైన పరిపాలన అందించేందుకు వీలుగా వీరిని రూర్బన్ గ్రేడ్ గ్రామ పంచాయతీల్లో నియమిస్తారు. నూతన విధానంలో గ్రామ పంచాయతీల్లో పని చేసే సిబ్బంది కూర్పులోనూ మార్పులు చేశారు. మున్సిపాలిటీల్లో ఉన్న విధంగా ప్లానింగ్, పారుశుధ్యం, మంచి నీటి సరఫరా మరియు ఆఫీస్ సిబ్బంది విభాగాలు ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా అవుట్‌ సోర్సింగ్/కాంట్రాక్ట్ సిబ్బంది జీతభత్యాలు గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి ఇస్తారు. అవసరాన్ని బట్టి ఇంజినీరింగ్, డిజిటల్ అసిస్టెంట్ల సేవలకు వీరిని వినియోగించుకునేందుకు ప్రభుత్వం అమోదం తెలిపింది. వీరిని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అసిస్టెంట్లుగా కూడా ఉపయోగిస్తారు. గ్రామ సచివాలయం బాధ్యతలతోపాటు భవనాలు, లే అవుట్ల నిబంధనలు వంటి సేవలనూ వీరు అందిస్తారు.

ఇంటర్ కేడర్ ప్రమోషన్లకు వెసులుబాటు
మినిస్టీరియల్ మరియు క్షేత్ర స్థాయి పోస్టుల మధ్య పరస్పర ప్రమోషన్లకు అవకాశం కల్పించారు. అందుకు సంబంధించిన సర్వీస్ రూల్స్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంటర్ కేడర్ ప్రమోషన్ల కోసం సిబ్బందికి రెండు వారాలపాటు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఏడాదిపాటు ఆన్ జాబ్ శిక్షణ ఉంటుంది. వీరికి క్షేత్ర స్థాయి అనుభవం, ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి పరిపాలన అనుభవం లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న వేతన శ్రేణిలోనే ఇంటర్ కేడర్ ప్రమోషన్లు అమలవుతాయి. దీంతోపాటు డిప్యూటీ ఎంపీడీఓ పోస్టింగ్ లకు విధివిధానాలు రూపొందించింది. నేరుగా డిప్యూటీ ఎంపీడీఓలుగా నియమితులైన వారు కనీసం మూడు సంవత్సరాల పాటు ప్రాథమిక శిక్షణ పూర్తి చేసి స్పెషల్ గ్రేడ్ పంచాయతీల్లో పంచాయతీ అభివృద్ధి అధికారులుగా పని చేయాలి. సంస్కరణల్లో భాగంగా పంచాయతీ రాజ్ శాఖలో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విభాగంలో అర్హులైన డిజిటల్ అసిస్టెంట్ల సేవలు వినియోగించుకుంటూ గ్రామ పంచాయతీల్లో రికార్డులు, ఆన్ లైన్ ద్వారా పరిపాలనను పర్యవేక్షిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *