Native Async

రాష్ట్రంలో పర్యటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ

Andhra Pradesh to Introduce Tourism Safety & Protection Policy: Deputy CM Pawan Kalyan’s Vision for Secure Tourism
Spread the love

•ఆంధ్రప్రదేశ్ పర్యటకం సురక్షితం అనే భావన పర్యాటకుల్లో కలగాలి
•పర్యటక ప్రదేశాల్లో ప్రత్యేక ప్రవర్తనా నియమావళి అమలు
•కుటుంబ పర్యటకులకీ, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం
•టూరిజం హాట్ స్పాట్లలో హెలీపోర్టులు అభివృద్ధి, నిర్ణీత కాలవ్యవధిలో ప్రణాళికలు అమలు చేయాలి
•అటవీ, పర్యటక, దేవాదాయ, రోడ్లు భవనాల శాఖల మంత్రుల సమన్వయ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం

మన రాష్ట్రంలో పర్యటక రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకునే విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేయాలి. రాష్ట్రానికి వచ్చే పర్యటకుల భద్రతకు 100 శాతం భరోసా ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా సురక్షితం అన్న భావన పర్యాటకుల్లో కలగాలి. అందుకోసం టూరిజం సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

రాష్ట్రానికి వచ్చే పర్యటకులు సంతోషంగా తిరిగి వెళ్లాలని తెలిపారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ తరలి వచ్చినప్పుడు వారికి భధ్రమైన పరిస్థితులు కల్పించాలనీ, మహిళ పర్యటకుల భద్రతకు ప్రత్యేక విధానం తీసుకురావాలని సూచించారు. సోమవారం రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఉపాధి కల్పనపై పర్యటక, దేవాదాయ, రోడ్లు మరియు భవనాల శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ బి.సి. జనార్ధన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రాష్ట్రంలో యువత, గిరిజన ప్రాంతాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు పర్యాటక శాఖలో అద్భుత అవకాశాలు ఉన్నాయి. టూరిజం హాట్ స్పాట్లను గుర్తించడం, అక్కడ సౌకర్యాలు మెరుగుపర్చడం ద్వారా దేశ, విదేశాల నుంచి పర్యటకులను ఆకర్షించవచ్చు. ఆయా ప్రాంతాల్లో హెలీపోర్టులు ఏర్పాటు చేయవచ్చు. అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. నిర్ణీత సమయంలో వాటిని అమలు చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నేను చాలా సందర్భాల్లో టూరిజం పాలసీపై చర్చించాం.

పర్యాటక అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల్లో అత్యంత ప్రాధాన్యతాంశం భద్రత. రాష్ట్రంలో ఏ మూలకి వెళ్లినా భద్రతకు ఇబ్బంది ఉండదు అన్న భావన టూరిస్టుల్లో కల్పించాలి. ప్రకృతిని ఇష్టపడుతూ అటవీ ప్రాంతాల్లో పర్యటించేవారికి తగిన భద్రత అందించాలి. పర్యటక ప్రదేశాల్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎకో టూరిజం అభివృద్ధి చేస్తున్న ప్రాంతాల్లో మన సంస్కృతి, సామాజిక పరిస్థితులపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. పర్యటకులతో ఎలా మసలుకోవాలి అనే అంశంపై ఒక ప్రవర్తనా నియమావళి తీసుకువచ్చి, దాన్ని కచ్చితంగా అమలు చేయాలి. ఉల్లంఘనలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ముఖ్యంగా హోటల్స్ నిర్వాహకులు, ట్రావెల్స్ నిర్వాహకులు ఈ నియమావళి కచ్చితంగా పాటించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.

•ప్రకృతి సంపదను వారసత్వ సంపదగా గుర్తించాలి:
టూరిజం హాట్ స్పాట్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో హెలీ టూరిజం అభివృద్ధి చేయాలి. అన్ని పర్యటక ప్రాంతాల్లో ఒక తరహా ఆర్కిటెక్చర్ ఏర్పాటు చేయాలి. మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆర్కిటెక్చర్ ని అభివృద్ధి చేయాలి. అది అంతరించిపోయిన కళలకు పునరుజ్జీవం పోసేదిగా ఉండాలి. రాష్ట్రంలో ఏ మూలకి వెళ్లినా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామన్న భావన పర్యటకులకు కలగాలి. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం వెంబడి అడ్వెంచర్ టూరిజం, కృష్ణా, గోదావరి జలాల్లో బోట్ రేసులు వంటి వాటిని నిర్వహించడం ద్వారా ఆకర్షించాలి. మంగళగిరి, కొండపల్లి, సిద్ధవటం తదితర కొండ ప్రాంతాల్లో పర్వతారోహణకు అనువైన పరిస్థితులు కల్పించాలి. పార్వతీపురం మన్యం ప్రాంతానికి వెళ్లిన సమయంలో అద్భుతమైన ప్రకృతి ప్రాసాధిత దృశ్యాలు వీక్షించే అవకాశం దక్కింది. అలాంటి ప్రాంతాలను వారసత్వ సంపదగా గుర్తించి పరిరక్షణకు ఏర్పాట్లు చేయాలి.

•మరిన్ని శాఖలను భాగస్వాముల్ని చేయాలి:
మన కవుల గొప్పదనాన్ని భావితరాలకు అందించేలా శ్రీ గుర్రం జాషువా గారు, కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు, శ్రీ గురజాడ అప్పారావు గారు, మొల్లమాంబ తదితరుల ఇళ్లను పరిరక్షించి, వాటిని సాహితీ సర్క్యూట్ గా ఏర్పాటు చేయాలి. సమాజాన్ని ఆధ్యాత్మిక, సేవా మార్గం వైపు నడిపిన మన అవధూతలు శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి, శ్రీ కాశీనాయన తదితరుల ఆశ్రమాలను స్పిరిట్యువల్ సర్క్యూట్ గా తీర్చిదిద్దాలి. అల్లూరి జిల్లా, చింతపల్లి ప్రాంతంలో ఉన్న జంగిల్ బెల్స్ సమస్యను పరిష్కరించాం. పర్యాటక అభివృద్ధిలో టూరిజం, అటవీశాఖలతో పాటు గిరిజన సంక్షేమ శాఖ, నీటిపారుదల శాఖలను కూడా భాగస్వామ్యం చేయాలి. ఎలాంటి ప్రణాళిక రూపొందించినా నిర్ణీత కాల వ్యవధిలో వాటిని పూర్తి చేయాలి” అన్నారు. ఇందుకు సంబంధించి తదుపరి సమావేశం జనవరి 6వ తేదీ నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, ఉన్నతాధికారులు శ్రీ అజయ్ జైన్, శ్రీమతి ఆమ్రపాలి, శ్రీమతి శాంతిప్రియ పాండే, శ్రీ రాహుల్ పాండే, శ్రీ శరవణన్, శ్రీ రామచంద్ర మోహన్, శ్రీ శ్రీనివాస్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీ కృష్ణబాబు, శ్రీ కాంతిలాల్ దండే, శ్రీ హరి జవహర్ లాల్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit