డిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న 25 మంది లోక్‌సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు రాష్ట్ర హక్కులపై ఒక్కరు నోరు విప్పకపోవడం పై తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత రాజకీయాలు, మోడీ మెప్పే ఈ ఎంపీలకు ముఖ్యమైపోయిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. 2014లో చేసిన ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్ట్, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, వెనుకబడిన జిల్లాల ప్రత్యేక ప్యాకేజీ, అమరావతి రాజధాని వంటి కీలక హామీలు ఉన్నప్పటికీ 11 ఏళ్లుగా 10 శాతం కూడా అమలుకాలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల పార్లమెంట్‌లో పోలవరం ఎత్తును 45 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గించారనే సమాధానం వచ్చినా, రాష్ట్ర ఎంపీలు మౌనం వహించడం ఏంటని షర్మిల ప్రశ్నించారు. పోలవరం ఖర్చు అంచనాలను 55 వేల కోట్ల నుంచి 30 వేల కోట్లకు తగ్గించడం, R&R ప్యాకేజీలను నిర్లక్ష్యం చేయడం, అమరావతికి కేంద్రం బాధ్యత తీసుకోకపోవడం—ఇవన్నీ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయమని ఆమె అన్నారు.
విభజన హామీలు చట్టబద్ధమైన హక్కులు అయినప్పటికీ, రాష్ట్ర ఎంపీలు బీజేపీకి బినామీలుగా మారి గుడ్డిగుర్రాల్లా తల ఊపుతున్నారని ఆమె దుయ్యబట్టారు. “మీ రక్తంలో నిజంగా తెలుగు వాడి గౌరవం ఉంటే… రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్‌లో స్వరం వినిపించండి” అని షర్మిల ఎంపీలను సవాల్ చేశారు.