తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రాజకీయ రంగంలో ఉత్సాహం ఉరకలేస్తోంది. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయ్యింది. 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుండగా, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామ స్థాయి రాజకీయాల్లో కుటుంబాల మధ్యే పోటీలు రగిలిపోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తెలుగుపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సర్పంచ్ పదవికి పోటీ పడటం స్థానికులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదిలాబాద్‌లో అత్త–కోడళ్లు ఇద్దరూ కాంగ్రెస్ మద్దతుతో రంగంలోకి దిగగా, జనగామలో తోడికోడళ్లు, సిద్ధిపేటలో తండ్రి–కొడుకులు మధ్య పోటీ నెలకొంది.
ఈ నేపథ్యంలో మరో విశేషం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ‘చంద్రబాబు’–’జగన్’ పేర్లు కలిగిన ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామానికి చెందిన భూక్యా చంద్రబాబు, బానోత్ జగన్నాథం అలియాస్ జగన్ ఇద్దరూ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరూ కాంగ్రెస్‌లోని వేర్వేరు వర్గాల మద్దతుతో బరిలో ఉన్నారు. పేర్ల కారణంగా గ్రామంలో ప్రచారం కూడా వినూత్నంగా సాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ తేదీ 9వ తేదీగా ఉన్నప్పటికీ, ఇద్దరూ పోటీ కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఒకరు తప్పుకునేలా పార్టీ పెద్దలు సయోధ్య ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని సమాచారం.