రాష్ట్ర ప్రభుత్వ విజయాలకు జిల్లాల కలెక్టర్లే కీలకం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 12 కొత్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఆయన దిశా నిర్ధేశం చేశారు. “360 డిగ్రీల పనితీరు పరిశీలించి మిమ్మల్ని ఎంపిక చేశాం. నా ఆలోచనలు, అంచనాలు అందుకోండి… బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వండి. సిఎం అంటే కామన్ మ్యాన్. మీరూ అదే పాటించండి. అన్నింటికీ రూల్స్ కాకుండా మానవీయ కోణంలో పనిచేయండి. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి” అని సూచించారు.ప్రజల ఆశలు తీర్చడమే లక్ష్యమని ఆయన అన్నారు.
“1995లో తొలిసారి సిఎం అయినప్పటి నుంచి ఎన్నో విపత్తులు ఎదుర్కొన్నాను. ఫైల్స్ క్లియరెన్స్, కఠిన నిర్ణయాలతో అభివృద్ధి వేగవంతం చేశాను. హుద్‌హుద్ తుఫాను సమయంలోనే ముందుగా ప్రజల మధ్యకు వెళ్లి 10 రోజులు ఉన్నాను. ప్రభుత్వం స్పందిస్తే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. లీడర్స్ అంటే రిస్క్ తీసుకోవాలి. అధికారుల సహకారమే విజయానికి మూలం” అని గుర్తుచేశారు.
కలెక్టర్లు ప్రజా సమస్యలపై నేరుగా దృష్టి పెట్టాలని సూచించారు. “ప్రభుత్వ ఆస్తులు రక్షించండి. పారదర్శకత పాటించండి. మీ కింది అధికారులు కూడా మీనుంచి స్ఫూర్తి పొందాలి. నేను ఎంచుకున్న మీరే నా టీం. పనిచేస్తే ప్రోత్సహిస్తా… ఫలితాలు రాకపోతే సహించను” అని హెచ్చరించారు.“మీ నిర్ణయాలు ఇన్నోవేటివ్‌గా ఉండాలి. ఇతర జిల్లాలతో పోటీ పడండి. ఏపీ ఎప్పుడూ నెంబర్ 1 గా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ ప్రచారాలకు వెంటనే స్పందించాలి. కలెక్టర్ అనేది అధికారం కాదు… కామన్ మ్యాన్‌గా ఉండాలి” అని సిఎం చంద్రబాబు నాయుడు సూచించారు.