•నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించండి
•వర్తమాన, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
•ప్రతి నియోజకవర్గం ఆర్థికంగా బలోపేతం కావాలి… యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచాలి
•మహిళలు, రైతుల సంక్షేమాన్ని విస్మరించకుండా ముందుకు వెళ్ళాలి
•పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి… జన సైనికులు, వీర మహిళలతో ఎప్పటికప్పుడు చర్చించాలి. తొమ్మిది మంది శాసనసభ్యులతో వన్ టూ వన్ సమావేశాలు నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
•నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ పై చర్చ
నియోజకవర్గాల్లో అభివృద్ధి, ఉపాధికి ఉన్న అవకాశాలు గుర్తించి వాటిని ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శాసన సభ్యుడిగా ఉన్న పదవి కాలంలో మనం చేసిన అభివృద్ధి నియోజకవర్గ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలనే తపనతో పని చేయాలి… ఆ పని తీరు ప్రజలు మెచ్చేలా ఉండాలని దిశానిర్దేశం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఏం కావాలో తెలుసుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీల పరిష్కారానికి పెద్ద పీట వేయాలని చెప్పారు. వన్ టూ వన్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం తొమ్మిది మంది శాసన సభ్యులతో ముఖా ముఖీ భేటీ అయ్యారు. ఆయా నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ పై చర్చించారు. ఈ సందర్భంగా ఏడాదిన్నర కాలంలో నియోజవర్గాల్లో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శాసనసభ్యులు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలను తెలియచేయడంతోపాటు తదుపరి లక్ష్యంగా తాము చేపట్టబోయే అభివృద్ధి పనులను వివరించారు. నియోజక వర్గాలలో నామినేటెడ్ పదవులు భర్తీపై చర్చించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వర్తమాన, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గం ఆర్థికంగా బలోపేతం కావాలనీ, అందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనతోపాటు పారిశ్రామికాభివృద్ధికి అనువైన వాతావరణం కల్పించాలని చెప్పారు. యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మహిళలు, రైతుల సంక్షేమాన్ని విస్మరించకుండా ముందుకు వెళ్ళాలన్నారు. పాలన సంబంధిత అంశాలతోపాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. కూటమి స్ఫూర్తిని బలంగా నిలపాలన్నారు.