శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌… క్యూఆర్‌ కోడ్‌తో 16 సేవలు

Good News for Tirumala Devotees

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ శుభవార్తను తీసుకొచ్చింది. భక్తులకు మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి భక్తుల అభిప్రాయాలను సేకరించి వారికోసం మరికొన్ని సేవలను ప్రవేశపెట్టేందుకు టీటీడీ నూతన ప్రయత్నాలు చేస్తున్నది. భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు ఫీడ్‌బ్యాక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం టీటీడీ అందిస్తున్న సేవలతో పాటు అదనంగా భక్తులు ఎలాంటి సేవలు కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి టీటీడీ సర్వేలు నిర్వహిస్తోంది. ఇంటరాక్టీవ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌ దీనినే ఐవీఆర్‌ఎస్‌ అనే పేరుతో వాట్సాప్‌ ద్వారా ఈ సర్వేను, భక్తుల నుంచి ప్రత్యక్షంగా సర్వేను ప్రారంభించింది. ఈ సర్వేల ద్వారా భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించి తిరుమల శ్రీవారి సేవల విషయంలో భక్తుల అనుభవాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది.

కీలక సర్వే

ఈ సర్వేలలో 16 కీలక అంశాలపై భక్తుల అభిప్రాయాలను సేకరించేందుకు ఒక విస్తృతమైన ప్రశ్నావళిని రూపొందించారు. ఇందులో అన్నప్రసాదం, కల్యాణకట్ట, శ్రీవారి ఆలయం, వసతి సౌకర్యాలు, క్యూ లైన్ నిర్వహణ, లగేజీ కౌంటర్లు, శుభ్రత, లడ్డూ ప్రసాదం, దర్శన అనుభవం వంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలపై భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేయడం ద్వారా సేవలను మరింత మెరుగుపరచడానికి టీటీడీకి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత అసిస్టెన్స్ బార్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో టీటీడీ ఉంది. ఈ ఏఐ సాంకేతికత భక్తులకు మరింత సులభమైన, వేగవంతమైన సేవలను అందించడంలో సహాయపడనుంది.

వాట్సాప్‌ ద్వారా

ఈనాటి ప్రజలు అత్యధికంగా వినియోగిస్తున్న వాట్సాప్‌ ద్వారా కూడా అభిప్రాయాల సేకరణ కోసం టీటీడీ సులభమైన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమల తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ క్యూఆర్‌ కోడ్‌లను ఏర్పాటు చేసింది. ఈ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. దీనికోసం టీటీడీ 9399399399 నంబర్‌ను ప్రవేశపెట్టింది. అభిప్రాయాలను ఈ నంబర్‌ ద్వారా వాట్సప్‌ సందేశాన్ని పంపవచ్చు. ఈ పేజీలో భక్తులు తమ పేరు, విభాగం ఎంచుకొని అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శనం, క్యూ లైన్, వసతి గదులు వంటి వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను నమోదు చేయవచ్చు.

సేవలకుల ద్వారా

దీంతో పాటుగా శ్రీవారి సేవకుల ద్వారా కూడా టీటీడీ అభిప్రాయ సేకరణను చేపడుతోంది. సేవకులు నేరుగా భక్తులను కలిసి, ప్రస్తుతం అందుతున్న సేవల గురించి, వాటిని మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ ప్రత్యక్ష సంప్రదింపుల ద్వారా భక్తుల నుంచి విలువైన సలహాలు, సూచనలు పొందడం సులభమవుతుందని టీటీడీ భావిస్తోంది. సేవలు గురించి విస్తృతంగా తెలుసుకునేందుకు సేవలకు ఎంతగానో ఉపయోగపడతారు. సేవల పట్ల గౌరవం కూడా కలుగుతుంది.

టీటీడీ మొబైల్‌ యాప్‌

వీటితో పాటుగా టీటీడీ త్వరలోనే మొబైల్‌ యాప్‌ను, టీటీడీ బుకింగ్‌ పోర్టల్‌ ద్వారా కూడా భక్తుల అభిప్రాయాలను సేకరించేందుకు ఓ ప్రత్యేకమైన అప్లికేషన్‌ను రూపొందించే ప్రయత్నం చేస్తున్నది. ఈ అప్లికేషన్ ద్వారా భక్తులు తమ సూచనలను సులభంగా పంచుకోవచ్చు. ఈ విధానాలన్నీ భక్తులకు మరింత సౌకర్యవంతమైన, సమర్థవంతమైన సేవలను అందించడంలో టీటీడీకి సహాయపడతాయి. ఈ సందర్భంగా టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. తమ విలువైన అభిప్రాయాలను, సలహాలు, సూచనలను తప్పకుండా తెలియజేయాలని, తద్వారా తిరుమలలో అందించే సేవలు మరింత మెరుగుపరచడంలో భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నది. భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా సేవలను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తామని టీటీడీ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *