పాకిస్తాన్లోని కరాచీ నగరం చారిత్రక క్షణానికి వేదికైంది. అక్కడి ప్రసిద్ధ స్వామినారాయణ్ మందిరంలో మొట్టమొదటిసారిగా మహావతార్ నరసింహా యానిమేటెడ్ సినిమా ప్రత్యేక ప్రదర్శన జరిగింది. సాధారణంగా భక్తి కార్యక్రమాలు మాత్రమే జరిగే ఈ ఆలయంలో ఒక హిందూ పురాణ గాథను ఆధారంగా తీసుకున్న యానిమేటెడ్ చిత్రాన్ని ప్రదర్శించడం అరుదైన సంఘటనగా నిలిచింది.
సినిమా ప్రదర్శన జరుగుతుందన్న వార్త ముందుగానే తెలిసి, వేలాది మంది భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. చిన్నా–పెద్ధా తేడా లేకుండా అందరూ ఆలయం ప్రాంగణంలో చేరి నరసింహ స్వామి అవతారతత్త్వాన్ని చూపించే దృశ్యాలను తిలకించారు. స్క్రీనింగ్ ప్రారంభమైన వెంటనే “నరసింహ” నామస్మరణతో ఆలయం ప్రతిధ్వనించింది. భక్తుల కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయి. ఒక విదేశీ నేలపై, ప్రత్యేకంగా పాకిస్తాన్లో ఇలాంటి దేవాదిదేవుని చిత్రాన్ని పబ్లిక్ స్క్రీనింగ్గా ప్రదర్శించడం అక్కడి హిందూ సమాజానికి ఎంతో గొప్ప విషయం.
నరసింహావతార కథలోని భక్తి, ధర్మం, రక్షణ సందేశాన్ని చూపించే ఈ చిత్రాన్ని చూసిన వారి హృదయాలు భక్తిరసంతో నిండిపోయాయి. భక్తులు ఈ సంఘటనను “ఇది కేవలం సినిమా కాదు… దివ్య అనుభూతి” అని వర్ణించారు. ఈ కార్యక్రమం కరాచీ హిందూ సమాజానికి ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంచిన అరుదైన సంబరంగా నిలిచింది.