బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకోవడంతో పాటు, విజయదశమి కూడా కావడంతో శ్రీవారి పుష్కరిణిలో స్నానాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. అర్థరాత్రి నుంచే పెద్ద ఎత్తున భక్తులు పుష్కరిణి వద్ద వేచి ఉండటంతో టీటీడీ అధికారులు విడతల వారీగా భక్తులను పుష్కరిణిలోకి అనుమతించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పోలీసుల సమన్వయంతో భారీ కేట్లను ఏర్పాటు చేసి విడతల వారీగా భక్తులను పుష్కరిణిలోకి అనుమతించి పుణ్యస్నానాలు ఆచరింపజేశారు.
ఇక క్యూలైన్లో ఉన్న భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు శ్రీవారి సేవకుల సహకారంతో కాఫీ, టీలు అందజేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఎటువంటి తోపులాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలు భక్తులు హాజరైనా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకున్నామని, పుష్కరిణిలో పుణ్యస్నానాలు కూడా సజావుగా పూర్తయ్యాయని అధికారులు తెలియజేశారు.