మనిషి మనుగడకు జీవనాధారం అడవులు. అడవులు లేకుంటే మనిషి మనుగడ శూన్యం. వాటిని రక్షించుకోవాలి. అందులో నివశించే మూగప్రాణులను కాపాడాలి… అదే సమయంలో ఇసుక, టేకు, మాఫియాను ఆగడాలకు అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో పట్టుదలతో సివిల్స్‌రాసి ఐఎప్‌ఎస్ అధికారిగా పదవి చేపట్టిన శ్రద్ధ, తన పనిని శ్రద్ధగా చేసుకుంటూ వెళ్తోంది. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు చంబల్ శాంక్చురీలో పనిచేస్తున్న సమయంలో 80 ఇసుక లారీలను సీజ్ చేసింది. మూడు నెలల కాలంలో ఆమెపై 11 సార్లు మాఫియా ముఠా దాడులు చేసింది.
చావు అంచుల వరకు వెళ్లినా ఆమె లెక్కచేయలేదు. లేడీ సింగంగా అడవుల్ని కాపాడుతూనే ఉన్నారు. టేకు అక్రమ రవాణా చేస్తున్న ఎన్నో వందల మందిని అరెస్ట్ చేశారు. బెదిరింపులకు లొంగిపోలేదు. బదిలీలకు కుంగిపోలేదు. ఈ రెండు తాను చేస్తున్న పనికి గుర్తింపే అంటోంది మధ్యప్రదేశ్‌లోని బిలాతోలా గ్రామానికి చెందిన ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ శ్రద్ధ పండరే. ఎన్నిసార్లు ఎంతమంది బెదిరించినా తలొగ్గేది లేదని, గిరిజన బిడ్డగా అడవులను, మూగజీవులను, వన్య ప్రాణులను రక్షించడమే లక్ష్యంగా పనిచేస్తానని అంటోంది. అత్యంత కష్టమైన ఈ ఉద్యోగంలో మగవాళ్లు సైతం భయపడుతుంటారు. కానీ, మగువ తెగిస్తే భద్రకాళి కాగలదని, దుష్టులను చీల్చిచెండాడగలదని నిరూపించింది.