భారత్ రక్షణ శక్తిని మరింత బలపరిచే దిశగా మరో ముఖ్య నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రష్యా తయారీ Su-57 ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను భారత వాయుసేనలో చేర్చేందుకు కేంద్రం పరిశీలనలో ఉందని సమాచారం. రెండు స్క్వాడ్రన్ల Su-57లను కొనుగోలు చేయడంతో పాటు, భవిష్యత్తులో స్వదేశీ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఆధ్వర్యంలో వీటిని దేశంలోనే ఉత్పత్తి చేసే ప్రణాళికలు ఉన్నాయని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.
Su-57 ఫైటర్ జెట్ రష్యా అత్యాధునిక సాంకేతికతతో తయారైన ఐదవ తరం యుద్ధ విమానం. దీనికి “స్టెల్త్” సాంకేతికత ఉండటం వలన రాడార్లకు కనిపించదు. శత్రు రక్షణ వ్యవస్థలను దాటుకుని క్షణాల్లో లక్ష్యాన్ని చేధించగల సామర్థ్యం కలిగిన ఈ విమానం, సుపర్సోనిక్ వేగం, అధిక దూరం, మల్టీ-రోల్ సామర్థ్యాలతో ప్రసిద్ధి చెందింది. క్షిపణులు, బాంబులు, గైడెడ్ వెపన్లు మోసుకెళ్లగల ఈ యుద్ధ విమానం వాయుసేనకు వ్యూహాత్మక బలాన్ని అందిస్తుంది.
ప్రస్తుతం భారత్ వద్ద సుఖోయ్-30ఎంకెఐ, రఫేల్, మిగ్-29 వంటి ఆధునిక యుద్ధ విమానాలు ఉన్నప్పటికీ, ఐదవ తరం స్టెల్త్ ఫైటర్లు ఇంకా అందుబాటులో లేవు. ఈ లోటును పూడ్చడానికి Su-57లు అత్యుత్తమ ఎంపికగా భావిస్తున్నారు. అమెరికా F-35 ఫైటర్ల కొనుగోలు విషయంలో భారత్కు పెద్దగా అవకాశాలు లభించకపోవడంతో, రష్యా Su-57 వైపు దృష్టి మళ్లిందని విశ్లేషకులు చెబుతున్నారు.
HAL ఆధ్వర్యంలో స్వదేశంలో ఉత్పత్తి జరిగితే, దేశీయ రక్షణ రంగానికి పెద్ద ఊతమవుతుంది. “మేక్ ఇన్ ఇండియా” స్ఫూర్తితో ఆధునిక టెక్నాలజీని భారతదేశం పొందే అవకాశం ఉంటుంది. దీనితో భవిష్యత్తులో స్థానిక ఉత్పత్తి ద్వారా ఖర్చులు తగ్గుతాయి.
అంతేకాదు, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల దృష్ట్యా, Su-57లను వాయుసేనలో చేర్చడం భారత్ రక్షణ శక్తిని గణనీయంగా పెంచుతుంది. శత్రు దేశాలకు ఇది ఒక బలమైన హెచ్చరికగానే కాకుండా, భారత రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే నిర్ణయమని నిపుణులు పేర్కొంటున్నారు.