ఇండిగో విమానాల రద్దుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు రోజులుగా ఇండిగో కార్యకలాపాలు దెబ్బతినడంతో వందల సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. శనివారం కూడా అదే పరిస్థితి కొనసాగి, హైదరాబాద్‌కు రావాల్సిన 26 విమానాలు, ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన 43 విమానాలు రద్దయ్యాయి. విమానాశ్రయాల్లో ప్రయాణీకులు గంటల తరబడి వేచి చూడాల్సి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి మరో వారం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో విమాన ప్రయాణీకుల ఇబ్బందులను తగ్గించడానికి రైల్వేశాఖ ముందుకు వచ్చింది. అత్యవసరంగా ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాల కోసం దేశవ్యాప్తంగా 114 ప్రత్యేక రైలు ట్రిప్పులను నడపడం ప్రారంభించింది. 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లను జతచేసి ప్రయాణికుల రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. సబర్మతి-ఢిల్లీ మధ్య ప్రత్యేక రైలు సేవను కూడా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.
దక్షిణ రైల్వే 18 రైళ్ల సామర్థ్యాన్ని పెంచగా, తూర్పు రైల్వే మూడు ముఖ్య రైళ్లకు స్లీపర్ కోచ్‌లు జత చేసింది. నార్తర్న్ రైల్వే ఎనిమిది రైళ్లలో థర్డ్ ఏసీ, చైర్‌కార్ కోచ్‌లను పెంచగా, పశ్చిమ రైల్వే థర్డ్, సెకండ్ ఏసీ కోచ్‌లను అదనంగా ఏర్పాటు చేసింది. ఈస్ట్ సెంట్రల్ రైల్వే కూడా అదనపు సెకండ్ ఏసీ కోచ్‌లను విడుదల చేసింది.
10 ప్రధాన రూట్లలో ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు ప్రీమియం రైళ్లలో అదనపు కోచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి. దీంతో ఇండిగో విమానాల రద్దుల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు రైల్వే శాఖ పెద్ద ఊరట కలిగించినట్టైంది.