సెప్టెంబర్ 24వ తేదీన లేహ్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు ఆగ్రహానికి స్థానిక బీజీపీ కార్యాలయం అగ్నికి ఆహుతైంది. దీంతోపాటు కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వాహనాన్ని కూడా నిరసనకారులు దగ్ధం చేశారు. ఈ ఘటనలో పోలీసులు, నిరసనకారుల మధ్య లోపలాట, లాఠీచార్జ్ జరగడంతో సుమారు 10 మంది గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా అధికారులు తెలియజేశారు.
లేహ్ అపెక్స్ బాడీ ఈ ఆందోళనకు ప్రాతినిథ్యం వహిస్తున్నది. లడఖ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని, ఆరో షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలను వెంటనే అమలు చేయాలని కోరుతూ నిరసనలు చేపట్టారు. గిరిజన సమాజాల భూములు, ఉద్యోగాలపై హక్కులు రక్షించుకోవడం కోసమే ఈ నిరసనలు చేపట్టారు. స్థానికంగా నిరుద్యోగం పెరుగుతుండటం, అభివృద్ధి పేరుతో స్థానిక వనరులకు ముప్పు ఏర్పడుతుందనే భయాలు కలుగుతున్న నేపథ్యంలోనే ఇలాంటి నిరసనలు జరుగుతున్నాయి.
గతంలో లడఖ్‌కు చెందిన ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ 35 రోజులపాటు నిరాహార దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన ఈ దీక్షను విరమించారు. కాగా, ఆందోళనకారులు చేపట్టిన ఈ నిరసనకు సోనం వాంగ్‌చుక్ మద్దతు తెలిపారు. అయితే, ఆందోళనకారులు చేపట్టిన నిరసన దీక్ష హింసాత్మకంగా మారడంతో వాంగ్‌చుక్ ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతియుత మార్గాల్లో తమ డిమాండ్లను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, లడఖ్ నాయకత్వంతో పాటు స్థానిక సంస్థల మధ్య చర్చలు అక్టోబర్ 6న జరగనున్నాయి. ఈ చర్చలు ఫలవంతమైతే లడఖ్‌లో ఆందోళనలు చల్లారే అవకాశం ఉంటుంది. ఒకవేళ చర్చలు విఫలమైతే పరిస్థితి ఏంటన్నది చూడాలి.