శాసన మండలి సభ్యులు కె. నాగబాబు గురువారం శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. “వర్షాల సమయంలో వరద నీటి కారణంగా ఇబ్బందులకు గురవుతున్నామని, సుదీర్ఘ కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని..” స్థానిక ప్రజలు, జనసేన పార్టీ స్థానిక నాయకులు వినతి పత్రాల ద్వారా
నాగబాబు దృష్టికి తీసుకురావడంతో బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా అక్కడి ప్రయాణికులతో మాట్లాడిన అనంతరం శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ కొరికన రవికుమార్ గారితో కలిసి ఆర్టీసీ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మాట్లాడారు. నిత్యం దాదాపుగా 60 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే శ్రీకాకుళం బస్టాండ్ అభివృద్ధికి సాధ్యం అయ్యే అవకాశాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 25 ప్లాట్ ఫాంలను 40కు పెంచి ఇంటీగ్రేటెడ్ బస్టాండ్ నిర్మిస్తే ప్రయాణికులకు అనుకూలంగానూ, ఆదాయ వనరుగా కూడా ఉపయోగ పడుతుందని అధికారులు ఎమ్మెల్సీ నాగబాబు కి వివరించారు.

లిఫ్టింగ్ పద్ధతిలో వరద నీటిని తోడి డ్రైనేజీలకు పంపే విధానం గురించి శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుగుణాకర్ వివరించారు. నగరానికి దగ్గరగా నూతన బస్టాండ్ నిర్మాణం కూడా ఒక మార్గంగా శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ కొరికన రవికుమార్ ప్రస్తావించారు.

ఈ సందర్భంగా అధికారులతో నాగబాబు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో తిరిగిన అనుభవాలు మాకూ ఉన్నాయని, బస్సుల్లో తిరిగిన వాళ్ళం కనుక ప్రయాణీకుల సమస్యలు తెలుసునని, సాధ్యం అయినంత తొందరలో శ్రీకాకుళం బస్టాండ్ ద్వారా రాకపోకలు సాగించే వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయాలని, తక్షణ అనుకూలమైన పనులను నివేదిక రూపంలో అందిస్తే శాసన మండలిలో ఈ అంశాన్ని ప్రస్తావించి.. ఎమ్మెల్సీగా సాధ్యమైనంత మేరకు శ్రీకాకుళం బస్టాండ్ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా నాయకులు డా. విశ్వక్ సేన్, పిసిని చంద్రమోహన్, గేదెల చైతన్య, డా. వేగులాడ దుర్గారావు, దాసరి రాజు, పేడాడ రామ్మోహన్, కొండా ఉదయ్ శంకర్, గురు ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.