విజయనగరం శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను పవిత్రంగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఉత్సవాల సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వి.ఐ.పి దర్శనాల వల్ల సాధారణ భక్తులకు ఇబ్బంది రాకూడదని స్పష్టం చేశారు. సిరిమాను తిరిగే ప్రాంతాల్లో రోడ్లు గుంతలు లేకుండా చూడాలని, పారిశుధ్యం, రక్షిత తాగునీరు, బయోటాయిలెట్స్, విద్యుత్ అలంకరణ, నగర సుందరీకరణ వంటి పనులను మున్సిపల్ శాఖ చూసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి, క్యూ లైన్ల వద్ద పేపర్ గ్లాస్‌లతో నీరు అందించాలని తెలిపారు.
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు, ఆర్.ఓ ప్లాంట్ల పరిశీలన, వైద్య శిబిరాలు, అత్యవసర మందుల ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశించారు. అక్టోబర్ 6, 7 తేదీల్లో ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీస్ శాఖ శాంతిభద్రతలు పటిష్టంగా నిర్వహించాలని అన్నారు. వాహన పార్కింగ్, బారికేడింగ్ ఎత్తు పెంపు, తెప్పోత్సవంలో గజ ఈతగాళ్లను నియమించడం వంటి అంశాలపై కూడా ఆదేశాలు ఇచ్చారు.
సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ మాట్లాడుతూ, అక్టోబర్ 1 నుండి 7 వరకు నగర సుందరీకరణ, సోషల్ మీడియా ప్రచారం, ఎల్.ఈ.డి స్క్రీన్ల ఏర్పాటు జరగాలని తెలిపారు. ఈ సమీక్షలో అదనపు ఎస్.పి సౌమ్యలత, డి.ఆర్.ఓ శ్రీనివాస మూర్తి, ఆర్.డి.ఓ కీర్తి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శిరీష, పూజారి బంటుపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.