ఈ బేటీలోని ముఖ్య అంశాలు:
- రాష్ట్రంలో ఒకేసారి 16 చిత్తడి నేలల గుర్తింపు
- సోంపేట చిత్తడి నేలల్లో టూరిజం కారిడార్
- వీరాపురం, పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పక్షి సంరక్షణ కేంద్రాలు
- కొల్లేరు లేక్ మేనేజ్మెంట్ అథారిటీకి ప్రతిపాదనలు
- స్టేట్ వెట్ ల్యాండ్ అథారిటీ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్
చిత్తడి నేలల సంరక్షణ భావితరాల భవిష్యత్తుకు అవసరం. పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెరుగుదల, పర్యాటక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 16 చిత్తడి నేలలను గుర్తించి, వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దక్షిణ భారతదేశ చరిత్రలో ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున చిత్తడి నేలలకు గుర్తించిన రాష్ట్రంగా చరిత్ర సృష్టించబోతోందని తెలిపారు. అందులో సోంపేట, తవిటి మండలాల పరిధిలో వేలాది ఎకరాల్లో విస్తరించి వున్న మూడు చిత్తడి నేలలను అనుసంధానిస్తూ భారీ పర్యాటక ప్రాజెక్టుకు రూపకల్పన చేయనున్నట్టు తెలిపారు.

కొల్లేరు మాదిరిగా మరిన్ని చిత్తడి నేలలకు రాంసర్ గుర్తింపు దక్కేలా అటవీ శాఖ వన్యప్రాణి విభాగం ఆధ్వర్యంలో చర్యలు చేపడతామని చెప్పారు. మంగళవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన స్టేట్ వెట్ ల్యాండ్ అథారిటీ సమావేశం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల భౌగోళిక సరిహద్దుల గుర్తింపు, అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “సుప్రీం కోర్టు ఆదేశాలకు లోబడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలల భౌగోళిక గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా 23,450 చిత్తడి నేలలు ఉన్నాయి. అందులో 99.3 శాతం నేలలకు డిజిటల్ సరిహద్దుల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యింది. వీటికి ఈ నెల 28 లోపు భౌతిక సరిహద్దుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అందుకోసం అటవీ శాఖ, రెవెన్యూ, సర్వే విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసి ఆ ప్రక్రియను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి.
చిత్తడి నేలల గుర్తింపు, అభివృద్ది ప్రక్రియలో అన్ని రాష్ట్రాల కంటే మనం ముందున్నాం. రాష్ట్ర పరిధిలో ఒకేసారి 16 చిత్తడి నేలలకు టెక్నికల్, గ్రీవెన్స్ కమిటీ ఆమోదం లభించింది. వీటిని అధికారికంగా గుర్తిస్తూ నోటిఫై చేయబోతున్నాం. అందులో సోంపేట, తవిటి మండలాల పరిధిలో 5 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న పెద్ద బీల, చిన బీల, తుంపర, చిత్తడి నేలలను ఒక కారిడార్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

2018లో పోరాట యాత్ర సందర్భంగా సోంపేట ప్రాంతంలో చిత్తడి నేలలను పరిశీలించాను. పర్యవేక్షణ లేక పెద్ద బీల, చిన బీల ప్రాంతం ఆక్రమణలకు గురైన విషయం స్థానికులు నా దృష్టికి తీసుకువచ్చారు. అధికారంలోకి వస్తే ప్రకృతి ప్రసాదితమైన ఆ చిత్తడి నేలలకు రక్షణ కల్పించడంతోపాటు అభివృద్ధి చేయాలని భావించాము. అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా సోంపేట చిత్తడి నేలలకు అధికారిక గుర్తింపు తీసుకువచ్చే చర్యల్లో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది.
వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తాం. ఎకో టూరిజం అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అనంతపురం జిల్లా పరిధిలోని వీరాపురం, రాజమండ్రి సమీపంలోని పుణ్యక్షేత్రంలో విస్తరించి ఉన్న చిత్తడి నేలలు అరుదైన పక్షి జాతులకు నెలవుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక పక్షుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా చర్యలు తీసుకుంటాం.
రాష్ట్రంలోనే అతిపెద్ది చిత్తడినేలగా రాంసర్ గుర్తింపు పొందిన కొల్లేరు లాంటి సరస్సుల పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కొల్లేరు చిత్తడి నేల పరిరక్షణ కోసం అటవీశాఖ వన్యప్రాణి విభాగం ఆధ్వర్యంలో ‘కొల్లేరు లేక్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించాను. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన మిగిలిన చిత్తడి నేలలకు కూడా అంతర్జాతీయ గుర్తింపు లభించేందుకు కృషి చేయాలి అని చెప్పారు.
ఈ సమావేశంలో CCLA శ్రీమతి జయలక్ష్మి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, పీసీసీఎఫ్ శ్రీ పి.వి. చలపతిరావు, అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, APCCF శ్రీమతి శాంతిప్రియ పాండే, అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ ఎస్. శరవణన్, WWF ఇండియా రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఫరిదా థంపాల్, ప్రముఖ శాస్త్రవేత్తలు శ్రీ రామ సుబ్రహ్మణ్యన్, డాక్టర్ గోల్డిన్ ఖుద్రోస్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.