•ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం
•రూ.8.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
•ఆలయ విస్తరణకు 30 ఎకరాల భూమి కేటాయింపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత పర్యటనలో ఏలూరు జిల్లా, ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, ఆలయ ప్రదక్షిణ మండప నిర్మాణంతోపాటు గ్రామం నుంచి కొండ పైకి వెళ్లేందుకు రోడ్డు నిర్మింపచేస్తానని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధి అంశాన్ని మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రెడ్డి గారిని కోరారు. ఇందుకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి రూ. 8.7 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. ఆలయానికి అనుబంధంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు 30 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి ఇప్పించారు.

సోమవారం ఐ.ఎస్.జగన్నాథపురం పర్యటనలో భాగంగా జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీ మనోహర్
గారితో కలసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం రూ. 3.5 కోట్ల దేవాదాయ శాఖ నిధులతో ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న ప్రదక్షణ మండపానికి, రూ. 3.7 కోట్ల పంచాయతీరాజ్ రోడ్ అసెట్స్ నిధులతో ఐ.ఎస్. జగన్నాథపురం గ్రామం నుంచి ఆలయానికి వెళ్లేందుకు నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసి, శిలాఫలకాలు ఆవిష్కరించారు. దీంతో పాటు ఇప్పటికే ఆర్ అండ్ బి శాఖ సహాయంతో పొంగుటూరు, లక్కవరం మధ్య గోతుల మయంగా ఉన్న రహదారికి రూ.1.5 కోట్లతో మరమ్మతులు చేయించారు. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈ రహదారిని పరశీలించారు.
•30 ఎకరాల భూమి పత్రాలు ఆలయ అధికారులకు అందజేత:
శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి భూమి ఇప్పిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 30 ఎకరాల భూ కేటాయింపుకి సంబంధించిన పత్రాలు సోమవారం పవన్ కళ్యాణ్ ఆలయ అధికారులకు అందజేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు హర్షధ్వానాలతో ధన్యవాదాలు తెలియజేశారు.

•పూల వర్షం, హారతుల స్వాగతం:
అంతకు ముందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ఐ.ఎస్. జగన్నాథపురం వచ్చిన పవన్ కళ్యాణ్ కు ప్రజలు దారి పొడవునా పూల వర్షంతో స్వాగతం పలికారు. రాజవరం, యర్రంపేట, గవరవరం, ఐ.ఎస్. జగన్నాథపురం గ్రామాల్లో ఆడపడుచులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హారతులతో స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు. పలువురు తమ సమస్యలను తెలియచేసేందుకు ముందుకు రాగా వారి వద్దకు వెళ్ళి వినతి పత్రాలు స్వీకరించి, వివరాలు తెలుసుకున్నారు. తిరుగు ప్రయాణంలో పొలాల్లో పని చేసుకుంటున్న కూలీలను ఆప్యాయంగా పలకరించి, వారితో ఫొటోలు దిగారు.