•మార్చి నాటికి నివేదిక రూపొందించాలి
•సచివాలయ సిబ్బంది పదోన్నతులపై మంత్రుల బృందం, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
గ్రామ సచివాలయాల పని తీరు, ఆ వ్యవస్థ నిర్మాణంపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరపాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. గ్రామ స్థాయిలో వివిధ శాఖల నిర్మాణం, సచివాలయం ఉద్యోగులను ఆయా శాఖలకు ఎలా అనుసంధానించాలి అనే అంశంపైనా కూలంకషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.

మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మంత్రుల బృందంతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు, వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ అనిత గారు, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ సత్య అనగాని గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాలవీరాంజనేయస్వామి గారు, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ రవి గారు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సంధ్య రాణి గారు మంత్రుల బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ సిబ్బందికి పదోన్నతుల కల్పన, ఇతర శాఖల్లో అనుసంధానించడానికి ఉన్న అవకాశాలపై మంత్రుల బృందం, ఆయా శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు.

గ్రామ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినప్పటికీ సచివాలయ వ్యవస్థ నిర్మాణం దెబ్బతినకుండా ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ మొత్తం ప్రక్రియపై వచ్చే మార్చి నాటికి పూర్తి అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసేందుకు అవసరమైన పక్షంలో ప్రతి నెలా ఒకసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి లోటుపాట్లపై చర్చిద్దామని చెప్పారు.

ఈ సమావేశంలో జి.ఎస్.డబ్ల్యూ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమ, వ్యవసాయ, హోమ్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, శాఖాధిపతులు పాల్గొన్నారు.