సెప్టెంబర్ 22 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. నవరాత్రుల సందర్భంగా ప్రధాని మోదీ దేశప్రజలకు తీయని కానుకను ఇచ్చారు. ఇప్పటికే జీఎస్టీ మండలి జీఎస్టీ విధానాలను ప్రకటించింది. జీఎస్టీ 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే అమలులోకి రాబోతున్నాయి. తద్వారా సామాన్యులకు అవసరమైన అన్ని రకాలైన నిత్యావసర వస్తువుల ధరలు నేలకు దిగిరానున్నాయి. దీంతో పాటు రవాణా వ్యవస్థకు కూడా ఊతం వస్తుంది. వస్తు రవాణాతో పాటు వస్తువుల ఉత్పత్తి రంగం కూడా వేగవంతం అవుతుంది. 2017కి ముందున్న పన్ను విధానాల కారణంగా తయారైన వస్తువులను రవాణా చేయడానికి చాలా ఇబ్బంది పడవలసి వచ్చేది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధమైన ట్యాక్స్ అమలులో ఉండటం వలన వస్తు రవాణా ఇబ్బందికరంగా మారింది.
కానీ, 2017లో తీసుకొచ్చిన జీఎస్టీతో ఆ విధానంలో మార్పులు వచ్చాయి. కాగా, ఇప్పుడు జీఎస్టీ శ్లాబులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పేదతరగతి వర్గాలు మధ్యతరగతి వర్గాలుగా మారిపోతారని, అదేవిధంగా మధ్యతరగతి వర్గాలకు డబుల్ లాభం చేకూరుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రతి రాష్ట్రం ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రోత్సహించాలని, రాష్ట్రాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవసరమైన సదుపాయాలను కల్పించాలని కోరారు. తద్వారా దేశంలో పరిశ్రమల స్థాపన, పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు సాధ్యమౌతాయని, దేశం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.