రెండు గంటలు పనిచేస్తే వెయ్యి రూపాయలు సంపాదించాను అని చెప్పడం సాధారణం. కానీ, రెండు గంటలు పనిచేస్తే 11 కోట్లు సంపాదిస్తా అని చెప్పడం అసాధారణం. ఎలాన్ మస్క్, అంబాని, అదానీ వంటి వారికే ఇలాంటివి సాధ్యమౌతుంటాయి. కానీ, నాకు ఇదేమంత పెద్ద కష్టం కాదని అంటున్నాడు బీహార్ జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ పార్టీని స్థాపించకముందు ఎన్నికల వ్యూహ రచయితగా వివిధ రాష్ట్రాల్లో పనిచేశాడు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ సిద్ధహస్తుడు.
ఐప్యాక్‌ను స్థాపించిన ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు ఇస్తూ తాను పనిచేసిన పార్టీలను గెలిపిస్తూ వచ్చాడు. పార్టీల వద్ద నుంచి పెద్దమొత్తంలో కలెక్ట్ చేశాడు. తాను పార్టీలకు సలహాలు సూచనలు ఇస్తే రెండున్నర గంటలకు 11 కోట్లు వసూలు చేస్తానని చెప్పడం విశేషం. బీహార్‌లో జన్ సురాజ్ పేరుతో పార్టీని స్థాపించిన ప్రశాంత్ కిషోర్ తన సొంత పార్టీని ఎన్నికల్లో నిలబెట్టి విజయం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. తాను సంపాదించిన సొమ్మును పార్టీకి విరాళంగా ప్రకటించాడు.