రాష్ట్రవ్యాప్తంగా నేడు (డిసెంబర్ 21) పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఐదేళ్లలోపు చిన్నారులను పోలియో వంటి ప్రమాదకర వ్యాధి నుంచి రక్షించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఉంది. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాకినాడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో మొత్తం 54 లక్షలకు పైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలన్న లక్ష్యంతో ఇప్పటికే 98 లక్షలకుపైగా వ్యాక్సిన్ డోస్‌లను అన్ని జిల్లాలకు పంపిణీ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను 2014లోనే పోలియో రహిత దేశంగా ప్రకటించినప్పటికీ, పొరుగు దేశాల్లో వైరస్ ప్రభావం కొనసాగుతుండటంతో అప్రమత్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 38 వేలకుపైగా బూత్‌లలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. బూత్‌లకు రాలేని పిల్లల కోసం ఇంటింటికీ వెళ్లే బృందాలు, రద్దీ ప్రాంతాల్లో ట్రాన్సిట్ బూత్‌లు, వలస ప్రాంతాల్లో మొబైల్ బృందాలు సేవలందిస్తున్నాయి.
ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా బాధ్యతగా స్వీకరించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు ముందుకు వచ్చి తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు సహకరించాలని ఆయన కోరారు.