బీజేపీ భవిష్యత్ వ్యూహాలకు పదును పెడుతోంది. భవిష్యత్తులో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు పథకాలను సిద్ధం చేస్తోంది. ఇదే విషయాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2029లో మాత్రమే కాదు, 2034, 2039, 2044లో కూడా బీజేపీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలుస్తారని, ఆయన 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే వరకు పదవీ విరమణ చేయరని స్పష్టం చేశారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లో 75 సంవత్సరాలు నిండినవారు వారి పదవులకు దూరంగా ఉండటం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ప్రస్తుతం మోదీ వయసు 74 ఏళ్లు. మరో ఏడాది తరువాత ఆయన తన పదవి నుంచి విరమణ చేయాలి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఈ విధానాన్ని అమలు చేసేందుకు అనుకూలంగా లేదని స్పష్టమౌతున్నది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఇప్పటికే భారత్ ప్రపంచ వేదికపై తన ప్రతిష్టను పెంచుకుంటూ వస్తున్నది. ఆర్థికంగా, సాంకేతికంగా, రక్షణ పరంగా, దౌత్య రంగాల్లోనూ మోదీ తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని శక్తివంతమైన దేశంగా ముందుకు నడిపిస్తున్నాయి.
ప్రధాని మోదీ లక్ష్యం వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడమే. అది సాధించే వరకు ప్రధాని విశ్రాంతి తీసుకోరని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రాజ్‌నాథ్ సింగ్ చేసిన ఈ ప్రకటనతో బీజేపీ భవిష్యత్తులో కూడా మోదీ ఆధిపత్యం కొనసాగనుందనే సంకేతాలు వెలువడ్డాయి. అయితే, రాజ్‌నాథ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 2044 వరకు మోదీనే ప్రధాని అభ్యర్థి అని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని తగ్గించే ప్రక్రియ అని, ఒక నాయకుడిపై మాత్రమే ఆధారపడి పార్టీని నడపడం సరికాదని పలువురు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. కానీ, బీజేపీ నాయకులు మాత్రం మోదీ ప్రజాదరణ, అభివృద్ధి దృక్పథం, ప్రపంచస్థాయిలో ఆయనకు ఉన్న గుర్తింపు ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని చెబుతున్నారు. భవిష్యత్తులో మోదీ నేతృత్వంలో భారత్ మరింతగా బలపడుతుందని, 2047 నాటికి వికసిత భారత్ సాధ్యమౌతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి బీజేపీ శ్రేణులు. బీజేపీ మనోబలం నెరవేరాలని మనం కూడా కోరుకుందాం.