హిమాలయ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందనుకున్న పవిత్ర రుద్రాక్ష చెట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనే పెరిగి కాయలు కాస్తుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో ఒక అరుదైన రుద్రాక్ష చెట్టు ప్రస్తుతం గుత్తులుగా కాయలు కాస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా రుద్రాక్షలు నేపాల్, హిమాలయాలు, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అలాగే ఇండోనేషియా వంటి ప్రాంతాల్లో మాత్రమే లభిస్తాయి. అలాంటి చెట్టు ఈ ప్రాంత వాతావరణానికి అలవాటు పడి, సమృద్ధిగా పెరిగి కాయల్ని ఉత్పత్తి చేయడం విశేషం.
కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ విభాగంలో పనిచేసి పదవీ విరమణ చేసిన బాలకృష్ణ, ఉద్యోగ జీవితం లో పర్యటించిన వివిధ ప్రాంతాల నుంచి అరుదైన మొక్కలను సేకరించి తన తోటలో నాటేవారని చెబుతున్నారు. అలానే కొన్ని సంవత్సరాల క్రితం తెచ్చిన ఈ అరుదైన రుద్రాక్ష మొక్కలు ఇప్పుడు పెద్ద వృక్షాలై ఫలిస్తుండటం గ్రామస్తుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.
రుద్రాక్షకు హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది. ఏకముఖి నుంచి 14 ముఖాల వరకు రుద్రాక్షలు లభిస్తాయి. ఒక్కో ముఖానికి ప్రత్యేక శక్తి, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. జ్ఞానం, ధైర్యం, ఆత్మ శాంతి, ఆరోగ్య లాభాలు అందిస్తాయని విశ్వాసం. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పవిత్ర వృక్షం పెరిగి సమృద్ధిగా కాయలు కాస్తుండటం స్థానిక ప్రాంతానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది.