అమెరికా – రష్యా మధ్య మరోసారి ప్రచ్చన్న యుద్ధం మొదలుకావడంతో రష్యా వివిధ దేశాలతో భాగస్వామ్యాన్ని పెంచుకుంటోంది. వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఇరాన్‌తో ఒప్పందం చేసుకుంది. గత కొంతకాలం క్రితం ఒప్పందం చేసుకోగా, ఈ ఒప్పందం అధికారికంగా అమల్లోకి వచ్చింది. రష్యా విదేశాంగ శాఖ ఈ ఒప్పందాన్ని చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్నది. ఈ బంధం మరింత బలోపేతం అవుతుందని, ఇరాన్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటామని రష్యా ప్రకటించింది.
రాజకీయ, ఆర్థిక, రక్షణ, సాంకేతిక రంగాల్లో రెండు దేశాల మధ్య బలీయమైన సంబంధాలు కొనసాగనున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కొత్త సమీకరణలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఈ ఒప్పందం ఆసియా- రష్యా దేశాల మధ్య నూతన ఒరవడి సృష్టించనున్నది. ఇప్పటికే రాజకీయ రంగంలో రెండు దేశాలు అంతర్జాతీయ వేదికలపై పరస్పరం మద్దతు ఇవ్వడానికి అంగీకరించాయి. పశ్చిమ దేశాల ఆంక్షలను ఎదుర్కొనడంలో ఇది వారికి పెద్ద దిక్సూచి కానుంది.
అంతేకాకుండా ఆర్థిక, ఇంధన రంగంలోనూ, వాణిజ్యపరంగా, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రెండు దేశాల మధ్య చమురు, సహజవాయువు ఎగుమతుల్లో రెండు దేశాలు పరస్పరం బలమైన భాగస్వామ్యం ఏర్పరుచుకోనున్నాయి. అదేవిధంగా రక్షణ రంగంలోనూ, సైనిక సహకారంలోనూ, ఆయుధాల సరఫరా విషయంలోనూ, ఉమ్మడి వ్యాయామాలు ఈ ఒప్పందంలో భాగం కానున్నాయి. ఇరాన్ రష్యా మధ్య ఒప్పందం యూరేషియాలో భౌగోళిక రాజకీయాల్లో పెద్ద ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. దీంతో పాటు సాంకేతిక రంగంలోనూ, ఏఐ, అంతరిక్ష సాంకేతిక రంగంలోనూ ఉమ్మడిగా పరిశోధనలు చేసేందుకు కూడా ఈ ఒప్పందం అవకాశం కల్పించనున్నది. మొత్తంగా చూసుకుంటే ఇరాన్ రష్యా మధ్య ఈ ఒప్పందం అంతర్జాతీయ రాజకీయ దిశను ప్రభావితం చేసే ప్రధానమైన పరిణామంగా భావిస్తున్నారు.