పశ్చిమదేశాల ఆర్థిక ఆంక్షల మధ్య రష్యా తన ఎనర్జీని ఆసియా దేశాలకు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఇండియాను “KEY PARTNER”గా పేర్కొంటూ, ప్రస్తుత ప్రాజెక్టులు మాత్రమే కాక భవిష్యత్ LNG ప్రాజెక్టుల నుంచీ కూడా సహజ వాయువు (LNG)ను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు మాస్కో తెలిపింది.
భారతదేశం సహజ వాయువు వాటాను ప్రస్తుత 6% నుండి 2030 నాటికి 15%కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ లక్ష్య సాధనలో LNG దిగుమతులు కీలకపాత్ర పోషిస్తున్నందున… రష్యా నుంచి వచ్చే ఈ పెద్ద ఆఫర్ వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యం. ఇప్పటికే ఇండియా-రష్యా ఎనర్జీ భాగస్వామ్యం పెట్రోల్, క్రూడ్ ఆయిల్ స్థాయిలో బలపడగా, ఇప్పుడు LNG రంగంలో కూడా అదనపు ఒప్పందాలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.
రష్యా యమాల్, ఆర్కిటిక్ LNG ప్రాజెక్టులతో పాటు సైబీరియా అభివృద్ధి ప్రాజెక్టుల నుండి కూడా ఇండియాకు దీర్ఘకాలిక సరఫరా భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పాశ్చాత్య ఆంక్షల కారణంగా యూరప్ మార్కెట్ పరిమితం కావడంతో రష్యా ఆసియా దేశాలైన ఇండియా, చైనా, టర్కీ వంటి దేశాలను ఎంపిక చేసుకుంది.
ఇండియా ENN, గేల్, రిలయన్స్, ONGC వంటి సంస్థలు రష్యా LNG ప్రాజెక్టుల్లో ఇప్పటికే భాగస్వామ్య చర్చలు జరుపుతున్న నేపధ్యంలో, ఈ తాజా ఆఫర్ రెండు దేశాల వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరచనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా, రష్యా-ఇండియా గ్యాస్ ఒప్పందం కేవలం ఎనర్జీ సరఫరాకే పరిమితం కాకుండా జియోపాలిటికల్ స్థాయిలో కూడా ప్రభావం చూపే కీలక అడుగుగా భావిస్తున్నారు.