రాష్ట్రంలో 15 నెలల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ తొలిసారిగా ఉమ్మడిగా భారీ రాజకీయ సభను నిర్వహిస్తున్నాయి. అనంతపురం వేదికగా బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ అగ్రనేతలు పీవీఎన్ మాధవ్, సత్యకుమార్ యాదవ్‌తో పాటు రాష్ట్ర నాయకత్వం, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు.
సభ వేదికను సూపర్ సిక్స్ పథకాల చిహ్నంతో 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు గల భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌తో తీర్చిదిద్దారు. ప్రాంగణం అంతా జెండాలు, హోర్డింగ్‌లు, తోరణాలతో అలంకరించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, ప్రధాని మోదీ, నారా లోకేష్ చిత్రాలతో వేదిక దారులు అలంకరించబడ్డాయి.
ఈ సభలో మూడు పార్టీల నేతలు ఇప్పటివరకు అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాల ద్వారా 1 లక్ష కోట్లు పైగా ప్రజలకు అందించిన సంక్షేమం గురించి వివరిస్తారు. అలాగే అమరావతి, పోలవరం, పోర్టులు, ఎయిర్‌పోర్టులు వంటి అభివృద్ధి ప్రాజెక్టులపై నివేదికను ప్రజలకు తెలియజేయనున్నారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుతూ, రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అందించామని నేతలు హైలైట్ చేయనున్నారు. “కలిసి వచ్చాం – కలిసి గెలిచాం – కలిసి పనిచేస్తున్నాం – భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం” అన్న ఐక్యతా సందేశాన్ని మరింత బలంగా ప్రకటించేందుకు ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.