బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్‌ఆర్టీసీ 7,754 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ సేవలు సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 2 వరకు అందుబాటులో ఉంటాయి. అందులో 377 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. సద్దుల బతుకమ్మ (సెప్టెంబర్ 30) మరియు దసరా (అక్టోబర్ 2) సమయాల్లో రద్దీ పెరగనుందని అంచనా వేస్తూ, సెప్టెంబర్ 27 నుంచే ప్రత్యేక బస్సులు నడిపేలా సంస్థ ప్రణాళిక రూపొందించింది. తిరుగు ప్రయాణానికి అక్టోబర్ 5, 6 తేదీల్లో కూడా బస్సులు అందుబాటులో ఉంచనుంది.
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌తో పాటు కెపిహెచ్‌బీ, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ వంటి ప్రధాన ప్రాంతాలనుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఇవి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా సర్వీసులు అందిస్తాయి.
దసరా ప్రత్యేక బస్సుల్లో మాత్రమే ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.16 ప్రకారం తిరుగు ప్రయాణంలో కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలు సవరించబడతాయి. ఈ సవరణలు సెప్టెంబర్ 20, 27–30 తేదీలు, అక్టోబర్ 1, 5, 6 తేదీల్లో అమల్లో ఉంటాయి. రెగ్యులర్ సర్వీసుల చార్జీలు యధావిధిగా ఉంటాయి.
ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ, “ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. గత ఏడాదికంటే ఈసారి అదనంగా 617 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం. రద్దీ ప్రాంతాల్లో తాగునీరు, కూర్చీలు, పబ్లిక్ అడ్రెస్ సిస్టం, క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించాం. అనుభవజ్ఞులైన డ్రైవర్లతో ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతాం” అన్నారు.
ప్రయాణికులు వైట్ నంబర్ ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించకుండా, అధికారిక వెబ్‌సైట్ tgsrtcbus.in ద్వారా రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 040-69440000, 040-23450033 కాల్ సెంటర్ నంబర్లను సంప్రదించవచ్చు.