వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సినీ హీరో విజయ్ స్థాపించిన టీవీకే తరపున పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నమ్మక్కల్, కరూర్ జిల్లాలో పర్యటించి సభలు నిర్వహించారు. అయితే, తమిళనాడులో విజయ్‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఉండటంతో సభలకు ఆయన్ను చూసేందుకు ఆయన చెప్పే మాటలు వినేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో నమ్మక్కల్ జిల్లాలో జరిగిన సభలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
అయితే, ఈరోజు సాయంత్రం సమయంలో కరూర్‌లో టీవీకే అధ్యక్షుడు విజయ్ ర్యాలీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 31 మంది మరణించారు. ఈ సంఘటన తమిళనాడును మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సభలకు భారీ సంఖ్యలో జనాలు హాజరైతే వారిని కంట్రోల్ చేయడం కష్టమనే సంగతి తెలుసు. సాధారణంగా సినీ హీరోల సినిమా వేడుకలకు భారీ సంఖ్యలు అభిమానులు హాజరవుతుంటారు. ఇక సినీ హీరో రాజకీయ నేతగా మారి సాధారణ జనాల మధ్యకు వస్తే ఆయన్ను చూసేందుకే ప్రజలు అధికసంఖ్యలో వస్తుంటారు. కరూర్‌లోనూ అదే జరిగింది. ముఖ్యంగా ఈ తొక్కిసలాటలో ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అదేవిధంగా 16 మంది మహిళలు కూడా ఈ తొక్కిసలాటలో మృత్యువాత పడ్డారు.
ఈ తొక్కిసలాట ఘటనపై అటు ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించింది. వీఐపీలకు భధ్రత కల్పించే విధంగానే సభలకు హాజరయ్యే ప్రజలకు కూడా భద్రత కల్పించాలని, వారిని సురక్షితంగా సభల నుంచి ఇంటికి వెళ్లేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇలా భారీ సంఖ్యలో జనాలు హాజరయ్యే సభలు ఉంటే లేదా రోడ్‌షోలు చేయవలసి వస్తే భారీకేడ్లు ఏర్పాటు చేసి పరిమిత సంఖ్యలో మాత్రమే జనాలు వచ్చేలా చూడటమో లేదంటే, రోడ్‌షోలకు అనుమతి ఇవ్వకుండా నేరుగా ఏదైనా ఒక ప్రదేశంలో సభను ఏర్పాటు చేసుకొని ప్రసంగించి వెళ్లిపోవడమో చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నది. తమ బలాన్ని చరిష్మాను నిరూపించుకోవడానికి రోడ్‌షోలు నిర్వహించి ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని నిపుణులు విమర్శిస్తున్నారు.