అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్1బి వీసా విషయంలో శనివారం రోజున కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. హెచ్1బి వీసా రెన్యువల్ చేసుకునే సమయంలో లక్ష డాలర్లు చెల్లించాలని, ప్రతిసారి రెన్యువల్ చేసుకునే సమయంలో ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని చెప్పడంతో ఒక్కసారిగా ఐటీ కంపెనీలు, ఐటీ నిపుణులు షాకయ్యారు. ప్రతిసారి వీసా రెన్యువల్ సమయంలో లక్ష డాలర్లు చెల్లించడం అంటే సాధ్యం కాదు. ఇంత మొత్తాన్ని చెల్లిండానికి ఏ కంపెనీ కూడా సిద్ధపడదు. శనివారం ట్రంప్ నిర్ణయం తీసుకున్న తరువాత అమెరికా నుంచి ఇండియాకు రావాలని ఫ్లైట్ ఎక్కిన ఐటీ నిపుణుల్లో గందరగోళం నెలకొన్నది. కంపెనీలతో మాట్లాడి కన్ఫార్మ్ చేసుకున్న తరువాతే ఇండియా వచ్చేందుకు సిద్దపడుతున్నారు. చాలా మంది ఐటీ నిపుణులు ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకోగా… వెకేషన్స్‌కి ఇండియా వచ్చిన టెకీలు హడావుడిగా టిక్కెట్లు బుక్ చేసుకొని తిరుగుప్రయాణమయ్యారు. కారణం ఈ ఆదివారం నుంచే ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ అమలులోకి వస్తుంది.
అటు టెక్ కంపెనీలు కూడా పెద్ద సంఖ్యలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తన నిర్ణయంపై కొంత వెనక్కితగ్గినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం హెచ్1బి వీసా తీసుకున్నవారికిగాని, రెన్యువల్ విషయంలోగాని ఈ నియమం వర్తించదని, కొత్తగా హెచ్1బి వీసా తీసుకునేవారికి మాత్రమే ఈ నియమం వర్తిస్తుందని ట్రంప్ ప్రభుత్వం చెప్పినట్టుగా కథనాలు వస్తున్నాయి. అంటే, ఇప్పుడు ఈ వీసాపై అమెరికాలో ఉన్న నిపుణులకు ట్రంప్ విధించిన లక్ష డాలర్ల వర్తించవనే అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న టెక్ నిపుణులు అమెరికాను వదిలివెళ్లిపోతే దాని వలన అమెరికా కంపెనీలు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ఇప్పటికిప్పుడు అమెరికాకు చెందిన స్థానిక టెక్నీషియన్లు దొరకడం కూడా కష్టమే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తన ఆర్డర్‌ను సవరించి ఉంటారని కథనం.