భారత్‌పై అమెరికా కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నది. వాణిజ్యపరంగా భయపెట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఇటీవల అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ న్యూస్ నేషన్ అనే అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్, బ్రెజిల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండే దేశాలతో వాణిజ్య సమస్యలు ఉన్నాయని, వాటిని తప్పకుండా పరిష్కరించాలని అన్నారు. ఈ దేశాలు అమెరికాతోనే కాకుండా ఇతర దేశాలతో కూడా ఓపెన్ మార్కెట్ చేస్తుండటం అమెరికాకు ఇబ్బందికరంగా మారిందని, ఈ చర్యలను ఆపాలని, ఆపకుంటే అమెరికాకు నష్టం జరిగే అవకాశం ఉంటుందని అన్నారు.
అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్నారని, తద్వారా అమెరికా రైతులకు నష్టం కలుగుతోందని, భారత్ రష్యా నుంచి చౌక ధరకు ఆయిల్‌ను కొనుగోలు చేయడంతో పాటు బ్రిక్స్ దేశాల వేదికలో కూడా ఇండియా కీలక పాత్ర పోషించడం అమెరికా వ్యూహాలకు అనుగుణంగా ఉండటం లేదని అన్నారు. ఇలాంటి చర్యల వలన అమెరికా తీవ్రంగా నష్టపోవలసి వస్తోందని అన్నారు.
అటు బ్రెజిల్ కూడా సోయా, మొక్కజొన్న పంటలపై రక్షణాత్మక విధానాలు అవలంబించడమే కాకుండా అధిక సుంకాలు విధించడం వలన అమెరికా ఉత్పత్తిదారులు నష్టపోతున్నారని అన్నారు. అమెరికా తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకోవలసి వస్తుందని తెలిపారు. ఇప్పటికే ట్రంప్ సుంకాలు విధించగా మరికొన్ని కొత్త సుంకాలు కూడా విధించే అవకాశాలను పరిశీలిస్తున్నారని లట్నిక్ మీడియాతో చెప్పడంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే, లట్నిక్ చేసిన ఈ వ్యాఖ్యలపై బ్రెజిల్, భారత్‌లు ఇప్పటి వరకు స్పందించలేదు.
లట్నిక్ వ్యాఖ్యలను బట్టి అమెరికా తన ప్రయోజనాల కోసం ఎంతదూరమైన వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అమెరికా ఏవిధంగా అయితే, తన ప్రయోజనాలు ముఖ్యమని భావిస్తూ సుంకాలు విధించేందుకు సిద్దపడుతున్నదో.. భారత్ వంటి దేశాలు కూడా తమ ప్రయోజనాలు కాపాడుకునేందుకు, తమ రైతులు, సామాన్యుల అవసరాలు తీర్చేందుకు సుంకాలు విధించడంలోనూ, ప్రపంచంలో ఎక్కడైతే తక్కువ ధరకు ఆయిల్ లభిస్తుందో అక్కడ కొనుగోలు చేయడంలోనూ ఎటువంటి తప్పులేదని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధాల కోసం భారత్ వంటి దేశాలు నిధులను ఎన్నటికీ సమకూర్చదు. వాణిజ్యపరంగా వచ్చిన సొమ్ముతో ఆయా దేశాలు ఎలా ఉపయోగించుకుంటుంది అన్నది కూడా భారత్ పట్టించుకోదు.