కెమరూన్‌లో రాజకీయ అస్థిరత మళ్లీ భగ్గుమంది. 92 ఏళ్ల ప్రస్తుత అధ్యక్షుడు పాల్ బియా 53.6% ఓట్లతో తన ఎనిమిదో వరుస పదవీ కాలాన్ని గెలుచుకున్నట్లు అధికారిక ఫలితాలు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా భీకర నిరసనలు చెలరేగాయి. అయితే ప్రతిపక్షం ఈ ఫలితాలను తిప్పికొట్టింది. వారి వాదన ప్రకారం ఇస్సా చీరోమా పేరుతో నిలిచిన ప్రతిపక్ష నాయకుడే నిజంగా 70% ఓట్లతో ఘన విజయం సాధించాడని పేర్కొంటోంది.
ఈ ఆరోపణలతో రాజధాని యావుండే, ఆర్థిక నగరమైన డౌలా మాత్రమే కాకుండా అనేక ప్రావిన్సుల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. “డెమోక్రసీని కాపాడండి”, “మాకు మార్పు కావాలి” అంటూ భారీ ర్యాలీలు ఏర్పాటు చేశారు. పోలీసులు, ర్యాపిడ్ రెస్పాన్స్ ఫోర్సులు బహుళ స్థాయిలో మోహరించబడ్డాయి. రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ వినియోగించిన నేపథ్యంలో జరిగిన ఘర్షణల్లో కనీసం నలుగురు మరణించినట్లు స్థానిక మీడియా నివేదికలు చెబుతున్నాయి. మరికొందరి పరిస్థితి తీవ్రంగా ఉంది.
పాల్ బియా ఇప్పటికే 40 ఏళ్లకు పైగా పాలనలో ఉన్నారు. 1982 నుంచి ఆయన అధికారంలో కొనసాగుతుండగా…వయసు, ఆరోగ్యం, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం… అనే అంశాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు వచ్చాయి. ఈ ఎన్నికలపై యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్, హ్యూమన్ రైట్స్ వాచ్ మొదలైనవారు “స్పష్టత లేని ఎన్నిక”, “ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ అయిందా?” అనే ప్రశ్నలు లేవనెత్తాయి.
మేం ఫలితాలను అంగీకరించడం లేదు, దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభిస్తున్నట్టు ప్రతిపక్షం ప్రకటించగా… రాజకీయం మారాలి అంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెమరూన్‌లో త్వరలో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.