అక్టోబర్ 6,7 తేదీల్లో విజయనగరం ఆరాధ్యదేవత పైడితల్లి జాతరను నిర్వహించేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులతో పాటు అటు పోలీసు యంత్రాంగం కూడా భద్రతా ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నది. జాతర సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసుశాఖ కసరత్తులు చేస్తున్నది. ఈ నేపథ్యంలో తోలేళ్లు, సినిమాను ఉత్సవాల నేపథ్యంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ దామోదర్, డీఎస్పీ గోవిందరావులు ప్రధాన రహదారులను పరిశీలించారు.
హుకుంపేట నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం, గంటస్థంభం, మూడు లాంతర్ల జంక్షన్ వరకు జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను పోలీసు అధికారులు అడిగి తెలుసుకున్నారు. జాతర సమయంలో విశాఖ నుంచి అదనపు సిబ్బందిని నియమిస్తున్నట్టుగా తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నదే పోలీసు శాఖ ముఖ్యోద్దేశమని అన్నారు.