ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను జిల్లా ప్రజలు శాంతియుతంగా, క్రమబద్ధంగా నిర్వహించుకోవాలని కోరుతూ విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పలు ఆంక్షలను విధించారు. వేడుకల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టంగా హెచ్చరించారు. నూతన సంవత్సరాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వద్దనే జరుపుకోవాలని సూచించిన ఎస్పీ, మద్యం సేవించి వాహనాలు నడిపి డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో ఇరుక్కొని జైలుకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు.
31-12-2025 అర్ధరాత్రి బహిరంగ ప్రదేశాలు, రహదారులపై నూతన సంవత్సర వేడుకలను నిర్వహించడాన్ని నిషేధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని తెలిపారు. అతివేగం, బైక్ రేసులు, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ప్రజలు రహదారులపై తిరగరాదని, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వాహన యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ముఖ్య కూడళ్లలో పోలీసు బందోబస్తు, పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి పెట్రోలింగ్, డ్రోన్ పెట్రోలింగ్, గస్తీని ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్, డ్యాన్సులు, పార్టీల నిర్వహణ, డీజేలు, లౌడ్ స్పీకర్ల వినియోగం, రంగులు పూయడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. మహిళలు, యువతులను వేధించడం, ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం విక్రయాలు ప్రభుత్వం నిర్దేశించిన సమయం వరకే అనుమతిస్తామని, నిబంధనలు ఉల్లంఘించే మద్యం షాపులు, బార్లపైనా చర్యలు ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు.